Begin typing your search above and press return to search.

భారతీయ సినిమా భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు!

భారతీయ సినీరంగాన్ని ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ఒక కీలకమైన పాలసీ సమీక్షను ప్రకటించింది.

By:  Sivaji Kontham   |   1 July 2026 12:19 AM IST
భారతీయ సినిమా భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు!
X

భారతీయ సినీరంగాన్ని ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ఒక కీలకమైన పాలసీ సమీక్షను ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో న్యూఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. దేశంలో సినిమా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఫిలింమేక‌ర్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఒక స్టడీ గ్రూప్‌ను (కమిటీ) ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్యానెల్‌కు సార‌థ్యం వహించడానికి ప్రముఖ గీత రచయిత, స్క్రీన్‌ప్లే రచయిత, ప్రసార భారతి చైర్‌పర్సన్ అయిన ప్రసూన్ జోషిని ప్రభుత్వం నియమించింది.

గతంలో సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సి) అధినేతగా కూడా సేవలందించిన ప్రసూన్ జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిపుణులు, టెక్నీషియ‌న్లు కూడా సభ్యులుగా ఉంటారు. ప్రస్తుత స్పీడ్ మీదున్న‌ వినోద ప్రపంచంలో భారతీయ సినిమా ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలను ఈ ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఈ కమిటీకి తమ అధ్యయనాన్ని పూర్తి చేసి.. ప్రభుత్వానికి తుది సిఫార్సులను సమర్పించడానికి మంత్రిత్వ శాఖ మూడు నెలల సమయాన్ని కేటాయించింది. దీర్ఘకాలిక సినిమా పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసే ముందు ద‌ర్శ‌కులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు.. ముఖ్య‌మైన‌ రాష్ట్ర ప్రభుత్వాల కీలక భాగస్వాముల నుండి ఈ ప్యానెల్ అభిప్రాయాలను సేకరించనుంది.

ఈ సినిమా ప్యానెల్ ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ చిత్రాల హ‌వాను పెంపొందించడంపై దృష్టి పెట్టనుంది. మన దేశీయ చిత్రనిర్మాతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రేక్షకులను ఎలా చేరుకోవాలో... గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారతదేశ స్థానాన్ని ఎలా మెరుగుప‌ర‌చాలో ల్యాండ్‌మార్క్ వ్యూహాలను ఈ కమిటీ సిద్ధం చేయనుంది. దీనితో పాటు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వర్చువల్ ప్రొడక్షన్ వంటి సరికొత్త టెక్నాలజీలను సినిమా నిర్మాణంలో ఎలా సమర్థవంతంగా అనుసంధానించాలో కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. క్రియేటివిటీ దెబ్బతినకుండా సరికొత్త డిజిటల్ టూల్స్‌ను మన మేకర్స్ ఎలా వాడుకోవాలో మార్గదర్శకాలను రూపొందించనున్నారు.

సినిమాల‌కు ఫైనాన్సింగ్ వ్య‌వ‌హారంలోను సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డానికి అధ్య‌య‌నం జ‌రుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా థియేటర్ల సంఖ్యను, స్క్రీన్ కౌంట్‌ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం `మోడల్ స్టేట్ సినిమా రెగ్యులేషన్స్`ను తీసుకువచ్చింది. ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా చిన్న న‌గ‌రాల్లోను థియేట‌ర్లు పెరిగేందుకు ఇది స‌హ‌క‌రిస్తుంది. ఈ కొత్త మోడల్ నిబంధనల ద్వారా అనుమతుల ప్రక్రియను సరళీకరించి.. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకీకృత వ్యవస్థను తీసుకురానున్నారు. తద్వారా చిన్న నగరాల్లో కొత్త థియేటర్ల స్థాపనకు పెట్టుబడులు పెరిగి.. థియేట్రికల్ మార్కెట్ మరింత విస్తరిస్తుంద‌ని కేంద్రం అంచ‌నా వేస్తోంది.