నీల్ చుట్టూ 'ఐదు'.. మరి డైరెక్టర్ ప్లాన్ ఎలా ఉందో..
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్, సలార్ వంటి భారీ విజయాల తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: M Prashanth | 1 July 2026 1:00 AM ISTపాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్, సలార్ వంటి భారీ విజయాల తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు, వినిపిస్తున్న కొత్త కాంబినేషన్ల వార్తలు చూస్తుంటే.. ప్రశాంత్ నీల్ చుట్టూ ఏకంగా ఐదు సినిమాలు తిరుగుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే వాటిలో ఏది ముందుగా పట్టాలెక్కుతుంది? డ్రాగన్ తర్వాత ఆయన అడుగు ఎటు పడుతుంది? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పూర్తి దృష్టి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంపైనే ఉంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. దేశభక్తి అంశాలను యాక్షన్ తో మిక్స్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఆ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల తర్వాత మరోసారి నీల్ మార్క్ మాస్ ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే డ్రాగన్ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ ఏ సినిమా మొదలుపెడతారన్న అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన రెండు భారీ ప్రాజెక్టులు ఆయన ముందున్నాయి. అందులో మొదటిది ప్రభాస్ తో చేయనున్న సలార్ పార్ట్-2: శౌర్యాంగ పర్వం. ఫస్ట్ పార్ట్ ముగిసిన విధానం కారణంగా రెండో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు యష్ తో తెరకెక్కనున్న కేజీఎఫ్ చాప్టర్-3 కూడా ప్రశాంత్ నీల్ లైనప్ లో ఉంది. ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ రెడీ అయిందని, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ వల్ల ఆ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అఫీషియల్ గా ప్రకటించని మరో మూడు ప్రాజెక్టుల గురించే ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో ప్రశాంత్ నీల్ చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి కూడా ఓ ప్రముఖ హీరోతో వర్క్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ కాంబోలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇవన్నీ ప్రస్తుతం రూమర్లుగా ఉన్నాయి. నీల్ ముందు ఒకవైపు సలార్ పార్ట్-2, మరోవైపు కేజీఎఫ్ చాప్టర్-3, ఇంకోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశాలు, మరోపక్క బాలీవుడ్ ప్రాజెక్టు.. ఇలా మొత్తం ఐదు సినిమాల చర్చ ఆయన చుట్టూ తిరుగుతోంది.
ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు కథకు, పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తన సినిమాలను ప్లాన్ చేస్తూ వచ్చారు. అందుకే ఆయన తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి కనిపిస్తోంది. డ్రాగన్ తర్వాత ముందుగా ప్రభాస్ తో సలార్ పార్ట్-2ను ప్రారంభిస్తారా? లేక కేజీఎఫ్-3కి ప్రాధాన్యం ఇస్తారా? లేదా ఊహించని కొత్త కాంబోను ప్రకటిస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
