అవన్నీ అబద్ధాలు, కావాలనే చేస్తున్నారు: వివాదంపై ప్రశాంత్ వర్మ ప్రెస్ నోట్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ఒక కాంట్రావర్సిలో చిక్కుకున్నారు.
By: M Prashanth | 2 Nov 2025 5:27 PM IST'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ఒక కాంట్రావర్సిలో చిక్కుకున్నారు. 'హనుమాన్' నిర్మాతలైన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా, పలువురు అగ్ర నిర్మాతలతో ఆయనకు అడ్వాన్సుల విషయంలో గొడవలు జరుగుతున్నాయని, ఈ పంచాయితీ ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ప్రశాంత్ వర్మ చాలా గట్టిగా స్పందించారు.
తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తూ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేశారు. కొన్ని మీడియా పోర్టల్స్, సోషల్ మీడియా ఛానెళ్లు.. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ దాఖలు చేసిన ఫిర్యాదును, అలాగే తాను ఇచ్చిన రిప్లైలోని కొన్ని భాగాలను మాత్రమే పట్టుకుని, ఒకపక్షంగా, క్లారిటీ లేకుండా నిజానిజాలు తెలుసుకోకుండా" వార్తలు ప్రచారం చేస్తున్నాయని ప్రశాంత్ వర్మ తీవ్రంగా ఖండించారు.
తనకు, ప్రైమ్‌షో సంస్థకు మధ్య వివాదం ఉన్న మాట వాస్తవమేనని, ఆ వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉందని వర్మ అంగీకరించారు. ఒక సమస్య ఇండస్ట్రీ ఫోరమ్‌లో పరిశీలనలో ఉన్నప్పుడు, దానికి సంబంధించిన వివరాలను మీడియాలో చర్చించడం కరెక్ట్ కాదని అన్నారు.
ఇలాంటి టైమ్‌లో, కేసుకు సంబంధించిన "ఇంటర్నల్ ప్లీడింగ్స్, ఈమెయిల్స్, అగ్రిమెంట్లు, ఆర్థిక వివరాలను" లీక్ చేయడం అనేది, ఛాంబర్ కి అడ్డు తగలడమే అవుతుందని ఆయన అన్నారు. ఇది కేవలం జనాల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని మండిపడ్డారు. ఈ వివాదంలో తన వెర్షన్‌ను కూడా ప్రశాంత్ వర్మ చాలా బలంగా వినిపించారు. "నాపై చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమైనవి, నిరాధారమైనవి కేవలం ప్రతీకార చర్యతో చేస్తున్నవి" అని ఆయన తన స్టేట్‌మెంట్‌లో తేల్చి చెప్పారు.
ఇక ప్రొడ్యూసర్లు చెబుతున్నట్లు తాను భవిష్యత్ సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకోలేదని, 'హనుమాన్' సినిమాకు గాను తనకు రావాల్సిన వాటా విషయంలోనే అసలు వివాదం నడుస్తోందని అన్నారు. తనకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చివరగా, ప్రశాంత్ వర్మ మీడియా హౌస్‌లను, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై క్లారిటీ లేకుండా ఊహించి వార్తలను ప్రచురించడం ఆపాలని, ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చే తుది తీర్పు కోసం వేచి ఉండాలని కోరారు.
