Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ వ‌ర్మ యూనివ‌ర్స్ లెక్క తేలిందిలా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   25 Aug 2026 3:10 PM IST
ప్ర‌శాంత్ వ‌ర్మ యూనివ‌ర్స్ లెక్క  తేలిందిలా?
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్ భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం `హనుమాన్` విజయం తర్వాత ఆయన ఒక్క సినిమాతో ఆగిపోకుండా ఏకంగా భారీ పౌరాణిక -ఫాంటసీ యూనివర్స్‌ను నిర్మిస్తున్నారు. అదే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU). ఈ ఫ్రాంచైజీ కింద ఒకదాని తర్వాత ఒకటిగా వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ `జాంబీ రెడ్డి 2`. గతంలో వచ్చిన `జాంబీరెడ్డి` చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2 తెర‌కెక్కుతుంది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా సుపర్ణ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర , షనయ్య కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగం అందించిన విజయానికి మించి సీక్వెల్ మరింత విభిన్నమైన కామెడీ, హర్రర్ , యాక్షన్ హంగులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

ఇదే సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో చిత్రం `మహాకాళి`. పూజ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం. పురాణాలలోని శక్తివంతమైన ఘట్టాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో అక్షయ్ కన్నా `శుక్రాచార్య` పాత్రలో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పాత్ర చిత్రణ, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి

ఇదే పీవీసీయూ ఫ్రాంచైజీ కింద ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్న `జై హనుమాన్` చిత్రం కూడా శరవేగంగా తెర‌కెక్కుతోంది. `హనుమాన్` సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రంపై భారీ బడ్జెట్ కేటాయించారు. అలాగే ఇదే యూనివర్స్ నుంచి `అధిరా` అనే మరో సరికొత్త సూపర్ హీరో సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా పురాణాలను, మోడరన్ సైన్స్ ఫిక్షన్‌ను జోడించి ప్ర‌శాంత్ వ‌ర్మ సృష్టిస్తున్న లోకాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించ‌నున్నాయి.

సాధారణంగా దర్శకులు ఒక్క విజయం సాధించిన తర్వాత రిలాక్స్ అవుతుంటారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఒకేసారి అగ్రశ్రేణి నటీనటులతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడం తో ఆయ‌న విజన్ ఏంటో అర్ద‌మ‌వుతోంది. సాంకేతిక హంగులకు, బలమైన పురాణ కథలకు పీవీసీయూ ప్రతీకగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద యూనివర్స్ సృష్టించబోయే రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయనేది ఆస‌క్తిక‌రం.

ప్రశాంత్ వర్మ వేస్తోన్న ప్రణాళికాబద్ధమైన అడుగులు ఆయన్ని తెలుగు దర్శకుడిగా కాకుండా గ్లోబల్ లెవెల్ ఫిల్మ్‌మేకర్‌గా నిలబెడుతున్నాయి. వరుస ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి ప్ర‌శాంత్ సిద్ధమవుతున్న తీరు ఆకట్టుకుంటోంది. యూనివర్స్ నుంచి వచ్చే ప్రతీ సినిమా ఇండియన్ మైథలాజికల్ జోనర్‌కు సరికొత్త నిర్వచనం ఇవ్వడం ఖాయం.