Begin typing your search above and press return to search.

పైలెట్ కాబోయి న‌టుడ‌య్యాడు..అయినా ప‌ర్వాలే!

దాదాపు రెండు ద‌శాబ్దాలగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నాడు. హీరోగా, విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసాడు.

By:  Srikanth Kontham   |   23 Jan 2026 8:30 AM IST
పైలెట్ కాబోయి న‌టుడ‌య్యాడు..అయినా ప‌ర్వాలే!
X

డాక్ట‌ర్లు కాబోయి యాక్ట‌ర్లు అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. హీరోల‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇంకొంత మంది సినిమాల్లోనే ఉండాలి అనుకునే వారు న‌చ్చిన శాఖ‌వైపు వెళ్లిపోతుంటారు. పెద్ద పెద్ద చ‌దు వులు..ఉన్న‌త ప‌ద‌వులు..వ్యాపారాలు సైతం వ‌దిలేసి సినిమాల‌పై ఆస‌క్తితో వ‌చ్చిన వారెంతో మంది. తాజాగా పైలెట్ కాబోయ్ యాక్టర్ అయిన వాళ్లు ఒక‌రున్నారు. అత‌డే త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న‌. విలక్ష‌ణ న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. న‌టి స్నేహ‌ను ప్రేమ వివాహం చేసుకుని ధాంప‌త్య జీవితంలోనూ సంతోషంగా ఉన్నాడు.

దాదాపు రెండు ద‌శాబ్దాలగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నాడు. హీరోగా, విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసాడు. అయితే ప్ర‌స‌న్న ముందుగా పెద్ద పైలెట్ అవ్వాల‌నుకున్నాడు. విమానాలు న‌డ‌పాలి అన్న ఆస‌క్తికి చిన్న‌ప్పుడే బీజం ప‌డింది. కానీ అనుకోకుండా న‌టన వైపు రావ‌డంతో పైలెట్ ప‌క్క‌కు వెళ్లాడు. అయినా త‌న చిరకాల కలలను నిజం చేసుకోవ‌డానికి వ‌య‌సుతో ప‌నిలేద‌ని ప్రూవ్ చేస్తున్నాడు. నటనను కొనసాగిస్తూనే కమర్షియల్ పైలెట్‌గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ ప్ర‌యాణానికి స్పూర్తి ఎవ‌రు? అంటే త‌ల అజిత్ కుమార్ పేరు చెప్పాడు. 2026 త‌న‌కెంతో ప్ర‌త్యేకం అన్నాడు. త‌న బకెట్ లిస్ట్‌లో ఉన్న రెండు కోరికలను తీర్చుకుంటున్నాడు. వ‌చ్చే ఏడాది ఇదే సమయానికి తాను ఫ్లైట్ స్కూల్ పాఠాలు పూర్తి చేస్తాన‌న్నాడు. అనంత‌రం క‌మ‌ర్శియ‌ల్ పైల‌ట్ లైసెన్స్ కూడా సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసాడు. అజిత్ తో క‌లిసి `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా చేస్తున్న‌ప్పుడు మోటార్ రేసింగ్‌పై ఆయనకున్న అభిరుచి, పట్టుదల త‌న‌ని క‌దిలించాయ‌న్నాడు.

న‌టుడిగా బీజీగా ఉన్నా? త‌నకు ఇష్ట‌మైన వాటి గురించి కూడా స‌మ‌యం కేటాయించ వ‌చ్చు అని అజిత్ ని చూసి తెలుసుకున్నాన‌న్నాడు. అందుకే ఇప్పుడు పైలెట్ ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నాడు. అలాగే ఏఐ నిపుణుడిగా మారాల‌న్న‌ది రెండ‌వ క‌ల‌. కోవిడ్ నుంచి ఏఐ నేర్చుకోవాల‌నుకుంటున్నాన‌న్నాడు. ఇంత కాలం వాయిదా వేసినా ఇప్పుడు మాత్రం స్నేహితుడు స‌ల‌హాతో ఆ ట్రైనింగ్ కూడా పూర్తి చేస్తాన‌న్నాడు.