Begin typing your search above and press return to search.

రాజ‌కార‌ణం చేస్తున్నా.. రాజ‌కీయం కాదు: ప్ర‌కాష్ రాజ్

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. విల‌క్ష‌ణ‌ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల మీడియాపైనా, కొందరి ప్రశ్నలపైనా తనదైన శైలిలో స్పందించారు.

By:  Sivaji Kontham   |   4 Oct 2026 9:00 AM IST
రాజ‌కార‌ణం చేస్తున్నా.. రాజ‌కీయం కాదు: ప్ర‌కాష్ రాజ్
X

ఇటీవ‌లి కాలంలో ప్ర‌కాష్ రాజ్ పొలిటిక‌ల్ పార్టీల గురించి తీవ్ర వ్యాఖ్య‌లతో, ప‌లు వివాదాల‌తో నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి మీడియాపై ఆయ‌న త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. సెటైర్ల‌తో తానేంటో చూపించిన వీడియో ఒక‌టి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. సినిమాల్లో విలన్ అయితే.. నిజ జీవితంలో హీరో కాకూడ‌దా? అంటూ ఆయ‌న విరుచుక‌ప‌డిన తీరు ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌గా మారింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. విల‌క్ష‌ణ‌ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల మీడియాపైనా, కొందరి ప్రశ్నలపైనా తనదైన శైలిలో స్పందించారు. సినిమాల్లో విలన్ పాత్రలు వేసినంత మాత్రాన నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనే భావనపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను చేస్తున్నది ఎన్నికల రాజకీయం కాదని.. ప్రజాక్షేమం కోసం ప్ర‌జాకీయం అని అన్నారు.

సినిమాలలో విలన్‌గా నటించడం కేవలం నటనలో భాగమేనని ప్రకాష్ రాజ్ తెలిపారు. `ఆకాశం నీ హద్దురా`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `శతమానం భవతి` వంటి చిత్రాలను ఉదహరిస్తూ తాను తెరపై విలన్‌గా కనిపించినా, రియల్ లైఫ్‌లో మాత్రం మంచి కోరుకునే వ్యక్తినేనని ఆయన పరోక్షంగా వెల్లడించారు. సినిమాల్లో విలన్ అయినంత మాత్రాన నిజ జీవితంలో హీరో కాకూడదా అంటూ ఆయన సెటైర్లు వేశారు.

తాను ప్రస్తుతం చేస్తున్నది ఎలక్షన్ రాజకీయం కాదని.. ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఏ పార్టీ పెడుతున్నావు? అని అడుగుతున్నారు..! ఇవాళ దేశానికి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు. కేవలం ప్రజల గొంతుకయ్యే ప్రశ్నించే రాజకీయం మాత్రమే కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశానికి ప్రస్తుతం ఈ తరహా రాజకీయమే అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ప్రజలు తమ హక్కుల గురించి ప్రశ్నిస్తుంటే దాన్ని వేరే కోణంలో చూడటం సరికాదని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. ప్రజలు నిలదీస్తుంటే వారిని ఓడించడానికి పార్టీలు పెట్టడం, అభ్యర్థులను నిలబెట్టడం వంటి చర్యల ద్వారా ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నలతో చంపుతున్నారని కొందరు అడుగుతున్న ప్రశ్నలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తనకు డబ్బుపై ఎలాంటి ఆశ లేదని.. ప్రజలు తనకి ఇప్పటికే ఎంతో ఇచ్చారని ప్రకాష్ రాజ్ అన్నారు. తానెవరో దాచుకునేంతటి దరిద్రుడిని కాదని.. కేవలం ఒక సాధారణ ప్రజానీకంగా మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపారు. ప్రజలను కేవలం ప్రజలుగా చూడాలని కోరుతూ.. అందరూ ప్రజాగుర్తుతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే మీడియాపై ఆయ‌న వ్యంగ్యంగా విరుచుకుప‌డిన తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయం కాదు రాజ‌కార‌ణం అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పైనా చ‌ర్చ సాగుతోంది.