రేట్లు ఎక్కువా.. సినిమాలు చూడకండి-ప్రకాష్ రాజ్
తాజాగా ఈ చర్చలోకి ప్రకాష్ రాజ్ కూడా వచ్చారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని విలేకరులు.. టికెట్ల ధరల గురించి అడిగారు. ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాల గురించి ప్రస్తావించారు.
By: Garuda Media | 27 Dec 2025 11:06 PM ISTసినిమా టికెట్ల ధరల గురించి ఈ మధ్య విస్తృత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రభుత్వం ఒక రేటు నిర్ణయించాక పెద్ద సినిమాల పేరు చెప్పి అదనపు రేట్లు పెట్టడం పట్ల ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల ఫుట్ ఫాల్స్ తగ్గిపోతున్నాయని.. ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. టికెట్ల రేట్లు సమస్యే అని కొందరు అంటే.. కొందరు మాత్రం ప్రేక్షకులకు ఉత్తమ వినోదం అందించే ప్రయత్నంలో బడ్జెట్లు పెరుగుతున్న నేపథ్యంలో రేట్లు పెంచకుంటే ఎలా అంటున్నారు.
తాజాగా ఈ చర్చలోకి ప్రకాష్ రాజ్ కూడా వచ్చారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని విలేకరులు.. టికెట్ల ధరల గురించి అడిగారు. ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాల గురించి ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ కొంచెం ఘాటుగానే స్పందించారు. టికెట్ల ధరలు ఎక్కువ ఉన్నాయంటే సినిమాలు చూడొద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరి వ్యాపారం వారిదన్న ఆయన.. సినిమాకు పెట్టిన ఖర్చును బట్టి టికెట్ల ధరలు ఉంటాయన్నట్లుగా మాట్లాడారు. టికెట్ల ధరలు ఎక్కువ ఉన్నందుకే పైరసీని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన తప్పుబట్టారు.
దొంగతనం చేసిన వాడిని ఎలా సమర్థిస్తారు.. అలాంటి వాళ్లను ఎలా హీరోను చేస్తారు అంటూ పరోక్షంగా ఐబొమ్మ విషయంలో మద్దతుగా నిలుస్తున్న వారిని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. ఒక పెద్ద దొంగను ప్రభువుగా ఎంచుకున్న సమాజం మనది అంటూ ఆయన పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు.
ఇక శివాజీ వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం మీద కూడా ఆయన స్పందించారు. స్టేజ్ మీద మాట్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. శివాజీ మాట్లాడింది ముమ్మాటికీ తప్పే అని ప్రకాష్ రాజ్ తేల్చి చెప్పారు. శివాజీ అంత చెత్తగా మాట్లాడితే ఎలా తనకు సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. అందుకే అనవసూయను సపోర్ట్ చేస్తూ తాను ట్వీట్ కూడా చేశానన్నారు. మహిళల వస్త్రధారణ వారి ఇష్టమని... ఈ విషయంలో ఎవరూ వారికి షరతులు పెట్టలేరని.. మహిళలకు మగాళ్ల నుంచే అన్యాయం జరుగుతోందని ఆయనన్నారు.
