Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ క్రిస్టియన్.. అసలు పేరు ఇదే: సీనియర్ నటుడు

తాను ఎప్పుడూ శ్రీరాముడిని ఎగతాళి చేయలేదని, హిందూ ధర్మాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.

By:  M Prashanth   |   20 April 2026 10:16 AM IST
ప్రకాష్ రాజ్ క్రిస్టియన్.. అసలు పేరు ఇదే: సీనియర్ నటుడు
X

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల రామాయణం, శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బహిరంగ చర్చలో రామాయణాన్ని కొత్త కోణంలో విశ్లేషించిన ప్రకాష్ రాజ్, శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశంలోని ఒక గిరిజన సమూహానికి చెందిన నాయకుడని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది.

అలాగే రాముడు పండ్లు దొంగిలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైందన్నట్లుగా చెప్పారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని కించపరిచేలా మాట్లాడారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలను ప్రకాష్ రాజ్ ఖండించారు. ఒక లిటరరీ ఫెస్టివల్‌లో "ఆర్ట్ అండ్ ఇట్స్ రెజిలియన్స్" అనే అంశంపై తాను చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు.

తాను ఎప్పుడూ శ్రీరాముడిని ఎగతాళి చేయలేదని, హిందూ ధర్మాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా తనకు ఎవరినీ తక్కువ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారే తనపై ‘యాంటీ హిందూ’ ముద్ర వేయాలని చూస్తున్నారని విమర్శించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన వారు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. ప్రకాష్ రాజ్‌పై విమర్శలు మాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రకాష్ రాజ్ వ్యక్తిగత విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటుడు ప్రకాష్ రాజ్ అని పేర్కొన్న సూర్య, ఆయన క్రైస్తవ మతానికి చెందినవారని తెలిపారు.

ఆయన కుటుంబ సభ్యులంతా క్రైస్తవులేనని, వారి కుటుంబంలో పాస్టర్లు కూడా ఉన్నారని అన్నారు. ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ ఆంటోని రాజ్ అని, అయితే పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోతాయనే కారణంతో ఆంటోని అనే పదాన్ని తీసేశారని చెప్పారు. ఇండస్ట్రీలో మతపరమైన అంశాలు కొన్నిసార్లు అవకాశాలపై ప్రభావం చూపుతాయని, అయితే తాను అలాంటి విషయాలు పట్టించుకోనని సూర్య స్పష్టం చేశారు.

అంతే కాదు.. పరిశ్రమలో చాలా మంది ఏసు క్రీస్తుపై విశ్వాసం ఉంచుతారని కూడా ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల చుట్టూ కొనసాగుతున్న వివాదం ఇంకా చల్లారలేదు. ఒకవైపు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటుండగా, మరోవైపు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు సూర్య చేసిన వ్యాఖ్యలు ఆ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌ గా మార్చాయి.