Begin typing your search above and press return to search.

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో చేసే ప్రచారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి'లో తాను నటిస్తున్నానని, తనను చూసి సినిమాను బాయ్‌కాట్ చేయాలని కొందరు ప్రచారం చేస్తారేమోనని వ్యాఖ్యానించారు. ఒక నటుడి రాజకీయ అభిప్రాయాల కారణంగా వందల మంది శ్రమించిన సినిమాను టార్గెట్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

By:  M Prashanth   |   11 Nov 2026 7:15 AM IST
రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్
X

సోషల్ మీడియా వేదికగా సినిమాలపై బాయ్‌కాట్ పిలుపులు ఇవ్వడం, నటీనటుల వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి ప్రాజెక్టులను టార్గెట్ చేయడం ఇటీవల కామన్ అయిపోయింది. తన రాజకీయ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నటుడు ప్రకాష్ రాజ్, లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ బాయ్‌కాట్ అంశంపై మాట్లాడారు. ముఖ్యంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

గతంలోనూ తన పాత్రలు ఉన్న సినిమాలను అడ్డుకుంటామని కొందరు ప్రచారం చేశారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కేజీఎఫ్ 2 విడుదల సమయంలోనూ ఇలాంటి ఆందోళనలు సోషల్ మీడియాలో కనిపించాయని, అయితే థియేటర్ల వద్ద ఆ చిత్రం సాధించిన వసూళ్లేమిటో అందరూ చూశారని గుర్తుచేశారు. ఇటీవల వచ్చిన ఇతర సినిమాల విషయంలోనూ విమర్శలు వచ్చినా, ప్రేక్షకులు సినిమా బాగుంటే థియేటర్లకు రావడం ఆగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే క్రమంలో రాజమౌళి రాబోయే ప్రాజెక్ట్ 'వారణాసి' అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తాను ఆ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని చెబుతూ, రేపు ట్విట్టర్‌లో తనను చూసి నెటిజన్లు రాజమౌళిపై పడతారేమోనని ఎద్దేవా చేశారు. ప్రకాష్ రాజ్‌ను ఎందుకు తీసుకున్నారంటూ డైరెక్టర్‌ను తిడతారని, ఆ తర్వాత బాయ్‌కాట్ వారణాసి అంటూ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. కేవలం ఆన్‌లైన్‌లో కూర్చుని ఇలాంటి ట్రెండ్లు నడపడం తప్పితే, నిజంగా అంత పెద్ద సినిమాను ఎవరైనా దేశంలో ఆపగలరా అని ఆయన నిలదీశారు.

తాను కేవలం నటుడిని మాత్రమేనని, చిత్ర నిర్మాణ బాధ్యత తనది కాదని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. ఒక భారీ సినిమా వెనుక వందలాది మంది సాంకేతిక నిపుణుల శ్రమ, నిర్మాతల భారీ పెట్టుబడులు ఉంటాయని చెప్పారు. కేవలం ఒక నటుడి రాజకీయ అభిప్రాయాలు నచ్చనంత మాత్రాన మొత్తం సినిమాను బహిష్కరించాలని చూడటం సరైన పద్ధతి కాదని ఆయన వాదించారు. ప్రేక్షకులు తెరపై కంటెంట్‌ను మాత్రమే చూస్తారని, వ్యక్తులపై ఉన్న అసంతృప్తితో వినోదాన్ని దూరం చేసుకోరని ఆయన చెప్పుకొచ్చారు.

వాస్తవానికి సోషల్ మీడియాలో జరిగే నిరసనలకు, క్షేత్రస్థాయిలో బాక్సాఫీస్ ఫలితాలకు చాలా సందర్భాల్లో పొంతన ఉండటం లేదు. గతంలోనూ ఎన్నో భారీ చిత్రాలు ఇలాంటి బాయ్‌కాట్ సెగను ఎదుర్కొని కూడా ఘన విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రకాష్ రాజ్ తరచూ వివాదాస్పద రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం వల్లే ఆయన చిత్రాలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందనే వాదన కూడా మరోవైపు నుంచి బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా, ఆన్‌లైన్ బాయ్‌కాట్ బెదిరింపులను తాను పెద్దగా పట్టించుకోనని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. సినిమాను ఆపాలనే ప్రయత్నాలు కేవలం బెదిరింపులకే పరిమితమని ఆయన కొట్టిపారేశారు.