Begin typing your search above and press return to search.

న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌లోని ఈ కోణం మీకు తెలుసా?

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేరే భాషకు చెందిన ఒక సీనియర్ నటుడిని కూడా ప్రకాష్ రాజ్ ఆదుకున్నారని రాజా ర‌వీంద్ర తెలిపారు.

By:  Sivaji Kontham   |   22 March 2026 9:29 AM IST
న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌లోని ఈ కోణం మీకు తెలుసా?
X

టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన అద్భుతమైన నటన, వెండితెరపై ఆయన పండించే వైవిధ్యమైన పాత్రలు. అయితే గత కొన్నేళ్లుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఆయనను ఒక వివాదాస్పద వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయాలు, వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా ఆయనపై రకరకాల ప్రచారాలు సాగుతున్నా .. తాజా ఇంట‌ర్వ్యూలో సీనియర్ నటుడు రాజా రవీంద్ర వెల్లడించిన విషయాలు అత‌డిలో ఉన్న ఒక గొప్ప మానవతావాదిని లోకానికి పరిచయం చేశాయి.

ప్రకాష్ రాజ్ కేవలం వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ ఎంతో పెద్ద మనసున్న వ్యక్తి అని రాజా రవీంద్ర పేర్కొన్నారు. తన జీవితంలో ఎదురైన ఒక క్లిష్ట స‌న్నివేశంలో ప్ర‌కాష్ రాజ్ చేసిన స‌హాయాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. తన కుమార్తె వివాహ సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు త‌న‌ను పిలిచి మ‌రీ స‌హాయం చేసార‌ని అన్నారు. తాను అడ‌గ‌కుండానే.. త‌న పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రకాష్ రాజ్ ఆర్థిక స‌హాయం అందించార‌ని తెలిపారు. ఆ సహాయం తన జీవితంలో మర్చిపోలేనిదని రాజా రవీంద్ర భావోద్వేగానికి లోనయ్యారు.

సహాయం చేయడమే కాకుండా దానిని తిరిగి ఆశించకపోవడం ప్రకాష్ రాజ్ గొప్పతనం. డబ్బు ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ దాని గురించి అడగలేదని.. ఆర్థిక లావాదేవీల‌ కంటే మనుషులకు, బంధాలకు ఆయన ఇచ్చే విలువ చాలా గొప్పదని రాజా రవీంద్ర కొనియాడారు. తోటి కళాకారుల కష్టాలను తన కష్టాలుగా భావించే గుణం ఆయనలో ఉందని.. ఈ సంఘటనతో అత‌డిలోని నిస్వార్థపరుడు బయటపడ్డారని ఇప్పుడు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

రాజా రవీంద్ర త‌న‌కు మాత్ర‌మే కాదు.. క‌ష్టాల్లో ఉన్న ఆర్టిస్టుల‌కు చాలా స‌హాయం చేసారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేరే భాషకు చెందిన ఒక సీనియర్ నటుడిని కూడా ప్రకాష్ రాజ్ ఆదుకున్నారని రాజా ర‌వీంద్ర తెలిపారు. ఆ నటుడి పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే ఆయనను పిలిపించి రూ. 50 లక్షలు ఇచ్చి అప్పులు తీర్చుకోమని సూచించార‌ని వెల్ల‌డించారు. ఇలా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసేంతటి గొప్ప మనసు ప్రకాష్ రాజ్ సొంతమని నిరూప‌ణ అయింది. అయితే అత‌డిలోని ఈ కోణం గురించి ప్ర‌చారం త‌క్కువ‌.

నటుడిగానే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ పాఠశాలలు, రోడ్లు వంటి కనీస వసతులు కల్పించి అభివృద్ధి చేశారు. ప్రకృతి ప్రేమికుడిగా సాదాసీదా జీవనాన్ని గడపడానికి ఇష్టపడతార‌ని కూడా రాజా ర‌వీంద్ర తెలియ‌జేసారు. ప్ర‌కాష్ రాజ్ కి హైద‌రాబాద్ ఔట‌ర్ లో 10 ఎక‌రాల ఫామ్ హౌస్ ఉంది. ఈ భూమిలో వ్య‌వ‌సాయం చేయ‌డం అంటే చాలా ఇష్టం. ఆయ‌న ఆర్గానిక్ వ్య‌వ‌సాయం చేస్తున్నారు. చెన్నైలో, బెంగ‌ళూరు ఔట‌ర్ లో కూడా ఫామ్ హౌస్ లు ఉన్నాయ‌ని రాజా ర‌వీంద్ర తెలిపారు.

దీనిని బ‌ట్టి ప్ర‌కాష్ రాజ్ త‌న‌పై ఎలాంటి ప్ర‌చారం సాగినా.. దాంతో సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన వారికి సహాయం చేయడంలో ముందుంటారని రాజా రవీంద్ర మాటలు నిరూపిస్తున్నాయి. వివాదాస్ప‌దుడిగా పేరున్నా.. దానికి అతీతంగా ఆయనలోని మానవత్వం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.