Begin typing your search above and press return to search.

వారణాసి.. విక్రమార్కుడు తర్వాత ఇప్పుడేనా..

ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడు తెలుగులో దాదాపు అందరు అగ్ర దర్శకులతో పనిచేశారు.

By:  M Prashanth   |   15 Dec 2025 4:54 PM IST
వారణాసి.. విక్రమార్కుడు తర్వాత ఇప్పుడేనా..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి' సినిమా మీద రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కాస్టింగ్ విషయంలో జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా సెట్ లోకి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అడుగుపెట్టారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. ఇందులో ఆయన మహేష్ బాబుకు తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం అని తెలుస్తోంది.

నిజానికి రాజమౌళి ఈ తండ్రి పాత్ర కోసం మొదట ప్రకాష్ రాజ్ ను అనుకోలేదట. వేరే ఒకరిద్దరు సీనియర్ నటులపై టెస్ట్ షూట్ కూడా నిర్వహించారని టాక్. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో రాజమౌళికి ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండిపోయిందట. తన కథకు, ఆ పాత్రలోని ఎమోషన్ కు ఆ నటులు సరిపోలేదని భావించి, చివరకు ఆ పాత్రను ప్రకాష్ రాజ్ దగ్గరకు తీసుకెళ్లారట. ఆయన సెట్ లోకి రావడంతో ఆ పాత్రకు నిండుతనం వచ్చిందని యూనిట్ వర్గాల మాట.

ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడు తెలుగులో దాదాపు అందరు అగ్ర దర్శకులతో పనిచేశారు. పూరీ జగన్నాథ్, వినాయక్, త్రివిక్రమ్, కృష్ణవంశీ.. ఇలా ఆ జనరేషన్ దర్శకులందరి సినిమాల్లో ఆయన పాత్రలు హైలైట్ గా నిలిచాయి. కానీ విచిత్రంగా రాజమౌళితో మాత్రం ఆయన ట్రావెల్ చాలా తక్కువ. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది ఒక్క 'విక్రమార్కుడు' సినిమా మాత్రమే.

అప్పట్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ ది మెయిన్ విలన్ పాత్ర కాదు. ఆయన చేసింది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రే. ఆ తర్వాత రాజమౌళి తీసిన మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఏ సినిమాలోనూ ప్రకాష్ రాజ్ కు అవకాశం రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ 'వారణాసి' సినిమాతో ఈ రేర్ కాంబినేషన్ సెట్ అయ్యింది. అందుకే ఈసారి రాజమౌళి ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

టెస్ట్ షూట్స్ చేసి మరీ, వేరే వాళ్లు సరిపోరని ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారంటే.. ఈసారి ఆయన పాత్ర నిడివి, ప్రాధాన్యత కచ్చితంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విక్రమార్కుడు సినిమాలోలాగా ఏదో వచ్చిపోయే పాత్రలా కాకుండా, కథను మలుపు తిప్పే బలమైన ఎమోషనల్ పాత్ర అయ్యుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో తండ్రి పాత్రలకు ఎప్పుడూ ఒక పవర్ ఉంటుంది.

మరోవైపు మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అంటేనే ఆన్ స్క్రీన్ మ్యాజిక్ అని అందరికీ తెలిసిందే. ఒక్కడు, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో వీరిద్దరి నటన అద్భుతంగా పండింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కు రాజమౌళి టేకింగ్ తోడవుతోంది. దాదాపు దశాబ్దన్నర తర్వాత రాజమౌళి సినిమాలో ప్రకాష్ రాజ్ నటిస్తుండటంతో, ఈసారి ఆయన విశ్వరూపం గ్లోబల్ స్థాయిలో చూడొచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.