'దృశ్యం-3'లో ప్రకాష్ రాజ్.. కానీ అది నిజం కాదు
ఐతే ప్రకాష్ రాజ్ హిందీ ‘దృశ్యం-3’లో నటిస్తున్నారు అనగానే.. ఆయన ‘దృశ్యం’ ఫ్రాంఛైజీ తొలి రెండు చిత్రాల్లో నటించిన అక్షయ్ ఖన్నా స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది.
By: Garuda Media | 11 Feb 2026 10:00 PM ISTఒకప్పుడు తెలుగులో పది సినిమాలు రిలీజైతే అందులో ఐదారు సినిమాల్లో ప్రకాష్ రాజ్ కనిపించేవాడు. తమిళంలోనూ బ్రేక్ లేకుండా సినిమాలు చేశారాయన. కానీ తర్వాత ఆయన జోరు తగ్గింది. ఒక దశలో నటనకు దాదాపుగా దూరమైనట్లు కనిపించారు. రాజకీయాలు, ఇతర వ్యవహారాల మీద ఫోకస్ చేశారు. కానీ తర్వాత మళ్లీ ఆయన నటనను సీరియస్‌గా తీసుకుని వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
ఇటీవల ఆయన చేతికి క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రభాస్, సందీప్ రెడ్డిల కలయికలో రూపొందుతున్న ‘స్పిరిట్’లో కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ ‘దృశ్యం-3’లో ఆయన ఓ ముఖ్య పాత్రకు ఎంపికయ్యారు.
ఐతే ప్రకాష్ రాజ్ హిందీ ‘దృశ్యం-3’లో నటిస్తున్నారు అనగానే.. ఆయన ‘దృశ్యం’ ఫ్రాంఛైజీ తొలి రెండు చిత్రాల్లో నటించిన అక్షయ్ ఖన్నా స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. ‘దురంధర్’ తర్వాత బంపర్ క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ భారీగా పారితోషకం డిమాండ్ చేశాడని, అలాగే విగ్గుతోనే నటిస్తాడని స్పష్టం చేశాడని.. ఆ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కారణాలు ఏవైనా సరే.. దృశ్యం-3లో అక్షయ్ లేడన్నది వాస్తవం.
ఆ పాత్రనే ప్రకాష్ రాజ్‌తో భర్తీ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదని ప్రకాష్ రాజ్ తేల్చేశాడు. ‘‘దృశ్యం-3లో నేను నటిస్తున్నాను. నా పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైంది. మీ అందరికీ ఆ క్యారెక్టర్ నచ్చుతుందని ఆశిస్తున్నా. కానీ నేను ఎవరి స్థానాన్నీ భర్తీ చేయడం లేదు’’ అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు. ప్రకాష్ రాజ్.. అక్షయ్ పాత్రను రీప్లేస్ చేయడం లేదంటే, మరి ఆ క్యారెక్టర్ చేస్తున్నదెవరు.. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏ క్యారెక్టర్లో నటిస్తున్నట్లు? ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుండగా.. మలయాళ దృశ్యం-3 మాత్రం ఏప్రిల్ 2నే విడుదల కానుంది.
