ఏడాది సమయం ఇవ్వండి.. అప్పుడే విమర్శిద్దాం!
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎటాకింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 20 Sept 2026 10:13 PM ISTవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎటాకింగ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. తాను నమ్మిన సిద్దాంపై బలంగా నిలబటం ప్రకాశ్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ క్రమంలో ప్రత్యర్ది వర్గంపై విమర్శలు కూడా అంతే ధీటుగా ఉంటాయి. అయితే కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రకాష్ రాజ్ ఏమాత్రం తొందర పడలేదు. నూతన ప్రభుత్వం ఏర్పాటై 120 రోజులు మాత్రమే అయినందున, విజయ్ పాలనా తీరును ఇప్పుడే విశ్లేషించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన పనితీరును నిరూపించుకోవడానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని కోరారు.
ఇంగ్లండ్‌లో జరిగిన కార్ రేస్ కార్యక్రమంలో స్నేహితుడు, నటుడు అజిత్ ను విజయ్ కలవడంపై వెల్లువెత్తిన విమర్శలపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక `లే మన్స్` రేసింగ్ ఈవెంట్‌కు ముఖ్యమంత్రి విజయ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో విజయ్‌తో పాటు నటి త్రిష కృష్ణన్, టీవీకే నాయకుడు ఆధవ్ అర్జున కూడా పాల్గొన్నారు. పోటీ స్థలంలో అజిత్‌ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, స్టేడియంలో ఉన్న అభిమానులు టీవీకే అంటూ నినాదాలు చేస్తున్నప్పుడు అజిత్ కోసం చీర్ చేయాలని విజయ్ సూచించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముఖ్యమంత్రిగా విజయ్ చేపట్టిన తొలి విదేశీ పర్యటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిధుల వ్యయం, పర్యటన వెనుక ఉన్న పారదర్శకతపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలు గుప్పించాయి. ఈ విమర్శలపై విజయ్ వర్గం స్పందిస్తూ ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయని తెలిపింది. ఈ పరిణామాలపై మాట్లాడిన ప్రకాష్ రాజ్, ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్ తనకు ఓటు వేసిన వారికే కాకుండా ఓటు వేయని ప్రజలందరికీ ముఖ్యమంత్రి అని గుర్తుచేశారు.
`ఎన్నికలకు ముందు విజయ్ రాజకీయ ఆలోచనలపై నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. వాటిని వ్యక్తం చేశాను కూడా. కానీ ప్రజలు అతడికి విజయాన్ని అందించి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి ఇంకా 120 రోజులే అయింది కాబట్టి మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వేచి చూడాలి అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అలాగే విజయ్-అజిత్ భేటీని ప్రకాష్ రాజ్ సమర్థించారు. ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి తన ఆప్తమిత్రుడైన అజిత్‌ను కలవడంలో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారిని ఇష్టం వచ్చినట్లు వెంటనే విమర్శించడం సరికాదని.. ఆయన ఏ లక్ష్యంతో విదేశాలకు వెళ్లారో అది నెరవేరిందా లేదా అన్నదే ప్రామాణికంగా చూడాలన్నారు. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చానని విజయ్ చెబుతున్నారని, ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
