జాతీయ అవార్డులపై విలక్షణ నటుడి ఆగ్రహం
జాతీయ చలచ చిత్ర పురస్కారాల జూరీ విధి విధానాలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
By: Sivaji Kontham | 4 Nov 2025 9:27 AM ISTజాతీయ చలచ చిత్ర పురస్కారాల జూరీ విధి విధానాలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల జూరీ అధ్యక్షుడి హోదాలో తనకు కల్పించిన స్వేచ్ఛ స్వతంత్య్రాల గురించి మాట్లాడుతూ కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను ఎంపిక చేసే జూరీ కి పని చేసే అవకాశం కల్పిస్తూ.. తాము అవార్డుల్లో వేలు పెట్టమని కేరళ ప్రభుత్వం వాగ్ధానం చేసినట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. జాతీయ అవార్డుల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదని కూడా అన్నారు. అక్కడ ఫైళ్ల కుప్పలు ఉంటాయని, ఇతరుల ప్రమేయం అధికంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇలాంటి ప్రభుత్వం (భాజపా-ఎన్డీయే) ఉన్నప్పుడు ముమ్మక్క (మమ్ముట్టి) వంటి వారిని జాతీయ పురస్కారం వరించే అర్హతను సాధించదని కూడా వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ అధ్యక్షతన జూరీ `భ్రమయుగం`లో నటనకు గాను మమ్ముట్టిని కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. జూరీ కోసం బయటి నుంచి వ్యక్తి కావాలని, వారి పనిలో తాము వేలు పెట్టమని కేరళ ప్రభుత్వ పెద్దలు వాగ్ధానం చేసినట్టు ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
55వ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మమ్ముట్టి ఉత్తమ నటుడి (భ్రమయుగం) గా ఎంపికవ్వగా, షమ్లా హంజా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇప్పటికే మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన మమ్ముట్టికి ఇది ఏడో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం. మమ్ముట్టి నట ప్రదర్శనపై ప్రశంసలు కురిపించిన ప్రకాష్ రాజ్ ఆయన నుంచి నేటితరం హీరోలు చాలా నేర్చుకోవచ్చని అన్నారు. ప్రతి చిన్న డీటెయిలింగ్ తో అతడి ప్రదర్శన చూసి తనకు అసూయ కలిగిందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. మమ్ముక్క యువకులతో పోటీపడి మెప్పిస్తారని ప్రశంసించారు. యువకులు ఇంకా ఆ స్థాయి వ్యక్తీకరణ(ఎక్స్ ప్రెషన్స్)ను సాధించాలని ప్రకాష్ రాజ్ సూచించారు.
2024-25 సీజన్ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో చిదంబరం నటించిన `మంజుమ్మెల్ బాయ్స్` ఉత్తమ చిత్రం సహా పలు పురస్కారాలను కైవసం చేసుకుంది. `మంజుమ్మెల్ బాయ్స్` చిత్రానికిగాను చిదంబరం ఉత్తమ దర్శకుడుగా పురస్కారం అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) అవార్డు ఈ సినిమాకి దక్కింది. నస్లెన్, మమితా బైజు నటించిన `ప్రేమలు` ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది. నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యుల జ్యూరీ సమక్షంలో సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. అయితే ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యల అనంతరం.. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉన్న స్వచ్ఛత, నిజాయితీ జాతీయ అవార్డుల్లో లేవా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
