హ్యాట్రిక్ హీరోకు బ్రేక్ పడినట్లేనా?
ప్రదీప్ రంగనాథన్.. చాలా తక్కువ సమయంలో అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించిన కుర్రాడు.
By: Garuda Media | 14 April 2026 12:00 AM ISTప్రదీప్ రంగనాథన్.. చాలా తక్కువ సమయంలో అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించిన కుర్రాడు. అతను పరిచయం అయింది దర్శకుడిగానే కానీ.. రెండో సినిమా లవ్ టుడేకు దర్శకత్వం వహించడమే కాక హీరోగా నటించి మెప్పించాడు ప్రదీప్. ఆ చిత్రం ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. ఆ తర్వాత అతను హీరోగా చేసిన డ్రాగన్, డ్యూడ్ కూడా ఘనవిజయాలు సాధించి తమిళంలోనే కాక తెలుగులోనూ ప్రదీప్‌కు క్రేజ్ తెచ్చిపెట్టాయి.
కానీ ఈ సక్సెస్ స్ట్రీక్‌ను తర్వాతి సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్ కొనసాగించగలడా లేదా అనే సందేహాలు ఈ సినిమా విడుదలకు ముందే రేకెత్తాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం బాగా ఆలస్యం కావడం.. ప్రోమోలు కూడా అంత గొప్పగా లేకపోవడంతో ఈ సినిమా ఫలితం మీద అనుమానాలు రేకెత్తాయి. అందుకు తగ్గట్లే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది.
తమిళంలో ఎల్ఐకేకు రివ్యూలు మోడరేట్‌గా వచ్చాయి. టాక్ కూడా అంతే. కానీ తెలుగులో ఆ మాత్రం టాక్, రివ్యూలు కూడా రాలేదు. ఇక్కడి ప్రేక్షకులకు సినిమాకు కనెక్ట్ కాలేదన్నది స్పష్టం. ప్రదీప్ క్రేజ్ వల్ల సినిమాకు ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. వీకెండ్ వరకు థియేటర్లలో ఓ మోస్తరుగా జనం కనిపించారు. కానీ వీకెండ్ తర్వాత సినిమా తెలుగులో నిలబడడం సందేహంగానే ఉంది. ఇక్కడ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్లాప్ కాబోతున్నట్లే. తమిళంలో కొన్ని రోజులు రన్ కొనసాగొచ్చు. కానీ ఓవరాల్‌గా చూస్తే అక్కడ కూడా సినిమాకు మంచి ఫలితం వచ్చేలా లేదు.
ఈ సినిమాపై ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివన్ భార్య అయిన స్టార్ హీరోయిన్ నయనతారనే నిర్మాత. లలిత్ కుమార్ మరో ప్రొడ్యూసర్. 2040లో నడిచే కథ కావడంతో అప్పటి వాతావరణాన్ని తెరపైకి తెచ్చేందుకు బాగా ఖర్చు పెట్టారు. కానీ సినిమా ఆలస్యం కావడం వల్ల, ప్రోమోలు గొప్పగా లేకపోవడం వల్ల సినిమాకు అనుకున్నంతగా బిజినెస్ జరగలేదు. ఈ సినిమా అంతిమంగా నిర్మాతలకు పెద్ద నష్టమే మిగిల్చేలా ఉంది. ప్రదీప్ బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు కూడా ఇది తెరదించినట్లే.
