Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ సీన్ రిపీట్.. ప్రదీప్ స్పీడ్‌కు బ్రేక్!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక వెలుగు వెలిగిన హీరోకైనా ఏదో ఒక పాయింట్ దగ్గర బాక్సాఫీస్ స్పీడ్ తగ్గక తప్పదు.

By:  M Prashanth   |   8 May 2026 9:53 AM IST
పవన్ కల్యాణ్ సీన్ రిపీట్.. ప్రదీప్ స్పీడ్‌కు బ్రేక్!
X

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక వెలుగు వెలిగిన హీరోకైనా ఏదో ఒక పాయింట్ దగ్గర బాక్సాఫీస్ స్పీడ్ తగ్గక తప్పదు. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి కోలీవుడ్ యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్‌కు ఎదురైంది. వరుసగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని జోరు మీద ఉన్న ఈ కుర్ర హీరోకు, ఒక సినిమా ఫలితం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. టాలీవుడ్‌లో పవన్‌కల్యాణ్ వరుస శతకాల రికార్డుకు ఎలాగైతే బ్రేక్ పడిందో, ఇప్పుడు ప్రదీప్ కెరీర్‌లో కూడా అదే రిపీట్ అవ్వడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పవన్‌కల్యాణ్ రీఎంట్రీ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, హరిహర వీరమల్లు, OG ఇలా వరుస సినిమాలతో వరుసగా వంద కోట్ల మార్కును దాటేశారు. కొన్ని సినిమాలకు టాక్ తేడా కొట్టినా సెంచరీ మాత్రం మిస్ కాలేదు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘ఉస్తాద్’ మాత్రం ఆ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో విఫలమైంది. వరుసగా కొనసాగుతున్న సెంచరీ రికార్డులకు గబ్బర్ సింగ్ కాంబినేషన్ బ్రేక్ వేస్తుందని ఎవరు ఊహించలేదు.

ఇక ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ‘లవ్ టుడే’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్, ఆ తర్వాత వచ్చిన డ్యూడ్, డ్రాగన్ సినిమాలతో కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఆయన రేంజ్ మారిపోతుందని అందరూ భావించారు. కానీ లేటెస్ట్ గా విడుదలైన ‘LIK’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) మాత్రం ప్రదీప్ జోరుకు కళ్లెం వేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

2040 బ్యాక్‌డ్రాప్‌లో టెక్నాలజీకి, ప్రేమకు మధ్య సాగే ఈ ప్రయోగం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 60.47 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది ట్రేడ్ వర్గాల అంచనా. దీనివల్ల ప్రదీప్ వరుసగా సాధిస్తున్న వంద కోట్ల రికార్డుకు బ్రేక్ పడినట్లయ్యింది. నిజానికి ప్రదీప్ రంగనాథన్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన సినిమాల్లో ఉండే నేటివిటీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా అలవాటైపోయింది. అయితే ‘LIK’ విషయంలో జరిగిన తప్పు ఏంటంటే, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా దాన్ని ప్రజెంట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎంత పెద్ద స్టార్‌కైనా బాక్సాఫీస్ వద్ద పరాజయాలు సహజమే. పవన్‌కల్యాణ్ లాంటి సీనియర్ హీరోకే ఫ్లాపులు తప్పనప్పుడు, కెరీర్ మొదట్లోనే ఉన్న ప్రదీప్‌కు ఇదొక మంచి లెసన్ అని చెప్పాలి. ఈ ఒక్క సినిమాతోనే ప్రదీప్ క్రేజ్ తగ్గిందని చెప్పలేం. ఎందుకంటే ఆయనపై ఆడియన్స్‌లో ఇంకా నమ్మకం ఉంది. నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో స్క్రిప్ట్ సెలక్షన్‌పై మరింత ఫోకస్ పెడితే మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆయనకు పెద్ద కష్టం కాదు. సినిమా రంగంలో ఒడిదుడుకులు సహజం, వాటిని దాటుకుని నిలబడటమే అసలైన సక్సెస్. మరి ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి చిత్రంతో మళ్లీ వంద కోట్ల క్లబ్‌లోకి రీఎంట్రీ ఇస్తాడో లేదో వేచి చూడాలి.