Begin typing your search above and press return to search.

LIK: ప్రదీప్ రంగనాథన్.. కేవలం క్రేజే కాదు..

ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా భారీ విజయం సాధించడంతో, వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్‌ లో చోటు సంపాదించిన హీరోగా అరుదైన రికార్డు సాధించారు.

By:  M Prashanth   |   12 April 2026 6:00 PM IST
LIK: ప్రదీప్ రంగనాథన్.. కేవలం క్రేజే కాదు..
X

ఎలాంటి సినీ బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం తన కెరీర్‌ లో మంచి జోష్ లో ఉన్నారని చెప్పాలి. వరుస విజయాలతో దూసుకెళ్లిన ఆయనకు.. తాజా చిత్రం LIK మాత్రం అనూహ్యమైన షాక్ ఇచ్చిందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఆ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా, లేడీ సూపర్ స్టార్ నయన తార నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. పలు వాయిదాల తర్వాత ఏప్రిల్ 10న విడుదలైన ఆ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా కాన్సెప్ట్ కొత్తదైనా, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రదీప్ తన పాత్రలో మెప్పించినప్పటికీ, మిగతా అంశాలు సినిమా స్థాయిని నిలబెట్టలేకపోయాయని మూవీ లవర్స్ అంటున్నారు. టెక్నికల్‌ గా బాగున్నా, కథనం నెమ్మదిగా సాగడం ప్రధాన లోపంగా మారింది. అయితే ప్రదీప్ రంగనాథన్ గతంలో చేసిన లవ్ టుడే సినిమా కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.

ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా భారీ విజయం సాధించడంతో, వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్‌ లో చోటు సంపాదించిన హీరోగా అరుదైన రికార్డు సాధించారు. అయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం ఆ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

కానీ మిక్స్‌డ్ టాక్ కారణంగా ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో షూటింగ్ పూర్తయి చాలా కాలం ఆలస్యంగా విడుదల కావడం వల్ల సినిమా మీద ఉన్న బజ్ తగ్గిపోయిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా, తమిళనాడులో కొనసాగుతున్న ఎన్నికల వాతావరణం కూడా ఓపెనింగ్స్‌ పై ప్రభావం చూపినట్లు సమాచారం.

తెలుగులో ఆ సినిమా పెద్దగా చర్చకు రాకపోవడం కూడా గమనార్హం. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కథలో కొత్తదనం లోపించడం ప్రేక్షకులను నిరాశపరిచినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో భారీ బడ్జెట్ పెట్టిన నయనతారకు ఆ చిత్రం ఆర్థికంగా భారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ఫలితం ఏదైనా.. కేవలం క్రేజ్ సరిపోదు.. బలమైన కంటెంట్ కూడా అవసరమనే విషయాన్ని లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరోసారి గుర్తుచేసిందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, టాలెంట్ ఉన్న ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి ప్రాజెక్టులతో మళ్లీ హిట్ ట్రాక్‌ లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.