ఈ డ్యూడ్‌కి నాల్గవ హిట్ పడేనా?
ప్రస్తుతం 'ఎల్‌ఐకే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
By: Ramesh Palla | 6 April 2026 5:00 PM ISTకోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఫిల్మ్ జర్నీ చాలా విచిత్రంగా సాగుతోంది. దర్శకుడిగా కోమాలి సినిమాతో కోలీవుడ్‌కి పరిచయం అయిన ప్రదీప్ ఆ తర్వాత నటుడిగానూ పరిచయం అయ్యాడు. ఈతరం ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు కమ్ హీరో అంటూ ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రచారం జరిగింది. తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ మొత్తం ప్రదీప్ రంగనాథన్ పేరు మారుమ్రోగేలా చేశాడు. నటుడిగా లవ్ టుడే తో తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. మొదటి సినిమాతోనే దాదాపు వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించిన నటుడిగా ఘనత సాధించాడు. దర్శకుడిగా తన ప్రతిభ ఏపాటిదో నిరూపించుకున్నాడు. అయితే హీరోగా వరుస సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతో పూర్తిగా నటనపై దృష్టి పెట్టి దర్శకత్వం ను ప్రస్తుతానికి పక్కన పెట్టాడు. ప్రస్తుతం 'ఎల్‌ఐకే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
లవ్ టుడేతో నటుడిగా...
ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలు లవ్ టుడు, డ్రాగన్, డ్యూడ్ సినిమాలు తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రదీప్ రంగనాథన్ సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కలుగుతుంది. అందుకే ఎల్‌ఐకే సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు తన గొంతును సైతం పరిచయం చేయాలి అనుకున్నాడు. టీజర్‌లో ప్రదీప్ గొంతుతో డబ్బింగ్ చెప్పించారు. అయితే ఇప్పటి వరకు ప్రదీప్ అనగానే గుర్తుకు వచ్చే గొంతుతో పోల్చితే ఒరిజినల్ గొంతు కాస్త ఎబ్బెట్టుగా, కొత్తగా అనిపించింది అనే కామెంట్స్ వచ్చాయి.
టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రదీప్ రంగనాథన్...
తెలుగులో ప్రదీప్ రంగనాథన్ డబ్బింగ్ చెప్పాలి అనే ఆలోచన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇంతకు ముందు మాదిరిగానే మరే డబ్బింగ్ ఆర్టిస్టుతో ప్రదీప్ కి డబ్బింగ్ చెప్పించడం మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారట. అందుకే డబ్బింగ్ విషయమై మరోసారి ఆలోచించి, చివరికి ఇంతకు ముందు ఎవరు అయితే ప్రదీప్ కి డబ్బింగ్ చెప్పారో వారితోనే ఎల్ ఐ కే సినిమాకు డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తూ ఉంటే, ప్రదీప్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా చాలా విభిన్నంగా ఉండేలా అనిపిస్తుంది. పైగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు అనిపిస్తోంది. ఇరవై ఏళ్లు ముందుకు తీసుకు వెళ్లి మరీ కొత్త ప్రపంచంను ఈ సినిమాలో దర్శకుడు విఘ్నేష్ శివన్ చూపించబోతున్నాడని, ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది.
ఎల్‌ఐకే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు...
ఈ మధ్య కాలంలో తెలుగులో వరుసగా విలన్ పాత్రలు పోషించి మంచి పేరును సొంతం చేసుకున్న ఎస్ జే సూర్య ఈ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సూర్య పాత్ర విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక యాప్ చుట్టూ ఎల్ ఐ కే సినిమా తిరుగుతూ ఉంటుంది. ఆ యాప్ కు వ్యతిరేకంగా హీరో ప్రదీప్ రంగనాథన్ పోరాటం చేస్తాడని ట్రైలర్‌లో చూపించాడు. ప్రేమకు యాప్ కి సంబంధం ఏంటి, అసలు సూర్య తీసుకు వచ్చిన యాప్ ఏంటి అనేది సినిమా కథాంశంగా ఉండబోతుంది. యూత్ ని ఆకట్టుకునే చాలా పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ నాల్గవ హిట్‌ను దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంతో పోల్చితే ప్రదీప్ రంగనాథన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. నాల్గవ హిట్ పడితే ప్రదీప్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసే అవకాశాలు ఎక్కువ అవుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
