డ్యూడ్.. సౌండ్ తో జాగ్రత్త!
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న డ్యూడ్ మూవీ.. మరికొన్ని గంటల్లో అంటే అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
By: M Prashanth | 16 Oct 2025 9:48 PM ISTకోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో తనదైన శైలిలో మెప్పించారు. ఇప్పుడు డ్యూడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు యూత్ సెన్సేషన్. దీపావళికి కానుకగా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఆ సినిమాతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమలు ఫేమ్ మమిత బైజు.. ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నేహా శెట్టి, రోహిణి, సత్య తదితరులు ఇతర పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న డ్యూడ్ మూవీ.. మరికొన్ని గంటల్లో అంటే అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే తాజాగా డ్యూడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కీలక లేఖను విడుదల చేసింది. సినిమాను రిలీజ్ చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలకు ఆడియో ప్రాసెసింగ్ లెవెల్ లో విషయంలో విజ్ఞప్తి చేసింది.
డ్యూడ్ చిత్రాన్ని మీ వేదికకు తీసుకురావడానికి తాము సంతోషిస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని నిర్ధారించడానికి, అన్ని ప్రదర్శనల కోసం ఆడియో ప్రాసెసర్ స్థాయిని కనీసం 5.5 విలువతో నిర్వహించాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పింది. సౌండ్ ట్రాక్ పూర్తి ప్రభావాన్ని అందించడానికి కనీసం 5.5 ఆడియో స్థాయి అవసరమని పేర్కొంది.
అందుకే అనుకున్నట్లు ఆ స్థాయిని నిర్వహించడంలో సహకారం చాలా ముఖ్యమని చెప్పింది. ఈ అభ్యర్థనకు మీ మద్దతు, శ్రద్ధను తాము ఎంతో అభినందిస్తున్నామని తెలిపింది. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే లేదా మరిన్ని వివరాలు అవసరమైతే, దయచేసి తమను సంప్రదించడానికి వెనుకాడకండని చెప్పింది. చిరస్మరణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని సృష్టించడంలో భాగస్వామ్యానికి ధన్యవాదాలు తెలిపింది.
ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అభ్యర్థనకు సంబంధించిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్యూడ్ సినిమాతో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడమే మైత్రి సంస్థ టార్గెట్ గా క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పటికే మూవీపై ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
