Begin typing your search above and press return to search.

డ్యూడ్ మూవీ స్టోరీ వెనుక ఇంత కథా.. రజినీకాంత్ తో సంబంధం?

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం డ్యూడ్

By:  Madhu Reddy   |   7 Oct 2025 12:00 AM IST
డ్యూడ్ మూవీ స్టోరీ వెనుక ఇంత కథా.. రజినీకాంత్ తో సంబంధం?
X

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం డ్యూడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సుధా కొంగర వద్ద దాదాపు 8 సంవత్సరాల పాటూ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కీర్తిశ్వరన్ ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ మాట్లాడుతూ.. "సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా నేను రాసుకున్న కథను మైత్రి మూవీ మేకర్ సంస్థ అధినేతలకు వినిపించాను. అయితే వాళ్లు కూడా కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించమని చెప్పారు. ఈ సినిమా కథను నేను రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని రాశాను. అలా రజనీకాంత్ ను దృష్టిలో పెట్టుకొని రాసిన ఈ కథ నటుడు ప్రదీప్ రంగనాథన్ తో చేయబోతున్నాను. ఈ పాత్రలో ఈయన చాలా అద్భుతంగా ఒదిగిపోయారు. లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఒక దర్శకుడిగా నా తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది నా కల నిజమవుతున్నట్లు అనిపిస్తోంది" అంటూ రజనీకాంత్ తో ఈ చిత్రానికి ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చారు.

అలాగే నటి మమిత బైజును ఎంపిక చేసుకోవడంపై కూడా మాట్లాడుతూ.." ప్రేమలు సినిమా విడుదలకు ముందే నేను మమిత బైజు నటించిన మలయాళ చిత్రం 'సూపర్ శరణ్య' చిత్రాన్ని చూశాను. ఆమైతే నా చిత్రంలోని పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని, ఆమెను ఎంచుకోవడం జరిగింది. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు కాంబినేషన్ చూస్తుంటే.. ఇందులో రజనీకాంత్, శ్రీదేవి లను జంటగా చూసినట్లు అనిపిస్తోంది." అంటూ తెలిపారు. ఇందులో శరత్ కుమార్, రోహిణి , పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇదిలా ఉండగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఎల్ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కూడా అదే రోజు విడుదలవుతూ ఉండడం గమనార్హం. ఒకే రోజు రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రదీప్ రంగనాథన్ ఈ రెండు చిత్రాలలో ఏ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.