టాలీవుడ్ కి దూరంగా ప్రభుదేవా!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్‌గా.. అగ్ర హీరోగా.. స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవా.
By: Srikanth Kontham | 26 Aug 2026 7:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్‌గా.. అగ్ర హీరోగా.. స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవా. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనదైన నటనతో, అద్భుతమైన డాన్సుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రభుదేవా కనిపించకపోవడం తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండటం తాజాగా ఇండస్ట్రీలో చర్చకొస్తుంది. ఒకప్పుడు తెలుగు పరిశ్రమను తన చిత్రాలతో ఊపేసిన ప్రభుదేవా ప్రస్తుతం తమిళ - హిందీ సినిమాలకే పరిమితమవుతున్నారు.
తెలుగు పరిశ్రమ పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న తరుణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రభుదేవా టాలీవుడ్‌లో ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. గత ఏడేళ్లుగా దేవా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి వ్యక్తిగత .. వృత్తిపరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ ... హిందీ పరిశ్రమల నుంచి వరుసగా నటన దర్శకత్వ అవకాశాలు రావడంతో ఆయన షెడ్యూల్‌ను ఆ రెండు ఇండస్ట్రీలకే కేటాయించాల్సి వస్తోందని సమాచారం. తెలుగు ప్రేక్షకులతో ప్రభుదేవాతో విడదీయరాని అనుబంధం ఉంది.
ఆయన దర్శకత్వం వహించిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `శంకర్ దాదా జిందాబాద్` వంటి చిత్రాలు టాలీవుడ్‌లో భారీ విజయాలను సాధించాయి. ముఖ్యంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా తెలుగు చిత్రసీమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అలాంటి అద్భుతమైన విజయాలను అందించిన దర్శక, నటుడు తెలుగు పరిశ్రమకు దూరంగా ఉండటం అభిమానుల్ని నిరుత్సాహ పరుస్తోంది. మరోవైపు టాలీవుడ్ యంగ్ జనరేషన్ దర్శకులు, నిర్మాతలు పాన్-ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రభుదేవా వంటి అనుభవజ్ఞుడైన టెక్నీషియన్ సేవలను ఉపయోగించుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణం ఏంటనే? ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
ఒకవేళ వచ్చిన అవకాశాలు ఆయన కాదంటున్నాడా? లేక అవకాశాలే రావడం లేదా? అన్న సందేహాలు కూడా లేకపోలేదు. అయితే సౌత్ సినిమా కల్చర్‌పై మంచి పట్టు ఉన్న ప్రభుదేవా టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చి అద్భు తమైన విజయాన్ని అందుకోవాలని తెలుగు ప్రేక్షకులు మాత్రం కోరుకుంటున్నారు. ప్రస్తుం ప్రభుదేవా ఖాతాలో ఆరేడు సినిమాలున్నాయి. అవి తమిళం, హిందీ, మలయాళం చిత్రాలు. అయితే ఇవన్నీ ఆయన నటుడిగా బిజీగా ఉన్న చిత్రాలే. చివరిగా ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా `రాధే` డైరెక్ట్ చేసారు. ఆ తర్వాత దర్శకుడిగా మాత్రం కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో 2027 లో నైనా ప్రభుదేవా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
