Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ (X) య‌ష్‌: బాక్సాఫీస్ బ‌రిలో రికార్డుల మోత‌!

ఈ బాక్సాఫీస్ పోరుకు యష్ నటిస్తున్న `టాక్సిక్` చిత్రం ద్వారా శ్రీకారం చుట్టబోతున్నారు.

By:  Sivaji Kontham   |   17 Aug 2026 12:00 AM IST
ప్ర‌భాస్ (X) య‌ష్‌: బాక్సాఫీస్ బ‌రిలో రికార్డుల మోత‌!
X

భారతీయ సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ సునామీ సృష్టించిన ఇద్దరు అతిపెద్ద పాన్-ఇండియా దిగ్గజాలు ప్రభాస్, యష్. బాహుబలి, కేజీఎఫ్‌ చిత్రాలతో ఇండియన్ సినిమా స్వరూపాన్నే మార్చేసిన ఈ ఇద్దరు బాక్సాఫీస్ మహారాజులు 2026 ఆగస్టు నుండి 2029-30 సీజన్ వరకు వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి భ‌విష్య‌త్ సినిమాల లైనప్ చూస్తుంటే థియేటర్ల వద్ద రికార్డుల మోత మోగడం ఖాయమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల అభిమానులు వీరి సినిమాల మధ్య పోలికలు పెడుతూ, బాక్సాఫీస్ రికార్డుల గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలుపెట్టారు.

ఈ బాక్సాఫీస్ పోరుకు యష్ నటిస్తున్న `టాక్సిక్` చిత్రం ద్వారా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సినిమా 2026 ఆగస్టు 26న విడుదల కానుండగా.. అదే ఏడాది డిసెంబర్ 3న ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం `ఫౌజి` విడుదల కానుంది. ఇక యష్ నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం `రామాయణం పార్ట్-1` 2026 నవంబర్ 6న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత 2027 మార్చి 5న ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెర‌కెక్కుతూ.. విపరీతమైన క్రేజ్ ఉన్న చిత్రం `స్పిరిట్` థియేటర్లలోకి రానుంది.

ఇక మ‌రికొన్ని భారీ చిత్రాల‌ విషయానికి వస్తే... యష్ నటిస్తున్న `రామాయణం పార్ట్-2` 2027 దీపావళి కానుకగా విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ తన గ్లోబల్ హిట్ ఫ్రాంచైజీ సీక్వెల్ `కల్కి 2898 AD పార్ట్-2`తో 2028లో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత 2029లో ప్రభాస్ నటించే `సలార్ 2` మోస్ట్ అవైటెడ్ మూవీగా థియేటర్లకు రాబోతోంది. ఆపై 2030 నాటికి ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చిన యష్ ప్రాజెక్ట్ KGF చాప్టర్ 3 గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ విధంగా వచ్చే మూడు, నాలుగేళ్ల కాలంలో ప్రభాస్, యష్ తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లతో సంచలనాలకు తెరలేపనున్నారు. వేల కోట్ల వసూళ్లను సాధించగల సత్తా ఉన్న ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు వరుస పాన్-ఇండియా విడుదలలతో బాక్సాఫీస్‌ను ఏలడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకరితో ఒకరు పోటీపడుతూనే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా మార్కెట్‌ను పెంచడంలో వీరిద్దరూ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.

అయితే ఈ రికార్డుల వేట కేవలం వీరిద్దరికే పరిమితం కాకుండా మరింత ఆసక్తికరంగా మారనుంది. బాక్సాఫీస్ రేస్‌లో వీరితో పాటు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి అగ్ర యువాస్టార్లు కూడా తమ భారీ ప్రాజెక్ట్‌లతో పోటీపడుతున్నారు. ఈ స్టార్లందరూ మునుముందు రోజుల్లో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.