షారుక్ వర్సెస్ ప్రభాస్: బిగ్గెస్ట్ సూపర్ స్టార్ డిసైడింగ్ ప్యాక్టర్!
ఈ వివాదానికి మరింత ఊపునిచ్చేలా రాబోయే రోజుల్లో ఇద్దరి సినిమాల విడుదల షెడ్యూల్ నిలవడం గమనార్హం.
By: Srikanth Kontham | 23 Aug 2026 10:00 PM ISTప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన అంశం `ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్` ట్యాగ్ వివాదం. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `స్పిరిట్` కోసం రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఈ బిరుదును ఉపయోగించడంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు, వాదనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న ఇద్దరు దిగ్గజ నటుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`బాహుబలి` సినిమాతో ప్రారంభమైన ప్రభాస్ పాన్-ఇండియా ప్రయాణం `సలార్`, `కల్కి 2898 ఏడీ` వంటి చిత్రాల వరకు ఏకధాటిగా విజయవంతంగా సాగింది. ఏ ప్రాంతీయ భాషతో సంబంధం లేకుండా నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని మార్కెట్లలోనూ ప్రభాస్ సాధించిన భారీ కలెక్షన్లు, బాక్సాఫీస్ స్టామినాను నిరూపించాయని ప్రభాస్ అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఈ ట్యాగ్ ఆయనకే పూర్తి అర్హత అని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా గ్లోబల్ స్థాయిలో బాలీవుడ్ సినిమాలను మోస్తున్న షారుఖ్ ఖాన్ రికార్డులను ఎవరూ అందుకోలేరని, దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ , అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయనకున్న ఆధిపత్యమే షారుక్ ని అసలైన సూపర్ స్టార్‌గా నిలబెడుతుందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇరువర్గాల అభిమానుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది.
ఈ వివాదానికి మరింత ఊపునిచ్చేలా రాబోయే రోజుల్లో ఇద్దరి సినిమాల విడుదల షెడ్యూల్ నిలవడం గమనార్హం. డిసెంబర్‌లో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న `కింగ్` సినిమాతో పాటు, ప్రభాస్ `ఫౌజీ` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు భారీ చిత్రాల బాక్స్ ఆఫీస్ ఫలితాలు, వసూళ్ల ఏ స్థాయిలో ఉంటాయనేది.. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఎవరికి చెందుతుందనేది స్పష్టమైన నిర్ణయానికి వస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ హద్దులు చెరిగిపోయి గ్లోబల్ మార్కెట్‌గా మారుతున్న తరుణంలో ఇలాంటి స్టార్ డమ్ పోరాటాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏ ఒక్క ఇండస్ట్రీకి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎవరికి బ్రహ్మరథం పడతారనేది రాబోయే బాక్సాఫీస్ గణాంకాలే తేల్చనున్నాయి. ఏది ఏమైనా? ఇద్దరు స్టార్ల మధ్య నడుస్తున్న పోటీ సినిమా రంగంలో సరికొత్త వ్యాపార స్థాయిలను సృష్టిస్తోంది.
`స్పిరిట్` సినిమా టైటిల్ కార్డ్ .. ట్యాగ్ వివాదం రూపంలో ప్రారంభమైన చర్చ ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రాజు ఎవరనే పెద్ద సవాల్‌గా మారింది. డిసెంబర్‌లో రాబోయే సినిమాల ఫలితాలే ఈ ట్యాగ్ రేసులో అసలైన విజేతను నిర్ణయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
