ప్రభాస్ గురించి 10 మంది కోస్టార్స్ కాంప్లిమెంట్లు
ప్రభాస్ కేవలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే `బాహుబలి` మాత్రమే కాదు, తోటి నటీనటుల దృష్టిలో ఒక గొప్ప మనిషి.
By: Sivaji Kontham | 15 Feb 2026 5:00 AM ISTప్రభాస్ కేవలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే `బాహుబలి` మాత్రమే కాదు, తోటి నటీనటుల దృష్టిలో ఒక గొప్ప మనిషి. అందుకే ఆయనను అందరూ ప్రేమగా `డార్లింగ్` అని పిలుస్తారు. జగపతిబాబు అతడి గురించి కోట్ చేస్తూ, తాజాగా ఆసక్తికరంగా స్పందించారు. ప్రభాస్ మనిషిగా ఎదిగిన పెద్ద మనిషి అని టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు పొగిడేసారు.
జగపతి మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాల్లో ఎంత పెద్ద హీరో అనేది పక్కన పెడితే.. మనిషిగా చాలా పెద్ద మనిషి.. మనిషిగా సక్సెసయ్యాడు.. ఇలాంటి వాళ్లంతా మనుషులుగా సక్సెసవుతున్నారు... కాబట్టి వీళ్లకు ఫెయిల్యూర్ ఉండదు.. లైఫ్‌లో విఫలం కారు.. అని అన్నారు.
అయితే ఇలాంటి ప్రశంసలు ప్రభాస్ కి కొత్తేమీ కాదు. గతంలోను పలువురు కోస్టార్లు అతడిపై ప్రశంసలు కురిపించారు. జగపతి బాబు లాగే ఇతర స్టార్లు ప్రభాస్ గురించి మంచి విషయాలు చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ మనస్తత్వం గురించి, అతడి వ్యక్తిత్వం, ఆతిథ్య ప్రవృత్తి గురించి ప్రశంసలు కురిపించారు.. బాహుబలి, సలార్, కల్కి 2898 ఏడి వంటి సినిమాలతో ఎంత పెద్ద స్టార్ అయినా కానీ అతడు మనిషిగా పెద్ద సక్సెసయ్యాడని సహచరులు చెబుతుంటారు.. తోలివారు అతడిని అభిమానిస్తారు..
ప్రభాస్ వ్యక్తిత్వం గురించి పది మంది ప్రముఖ తారలు చేసిన ప్రశంసా వ్యాఖ్యలు పరిశీలిస్తే...కల్కి 2898 AD సహనటుడు అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిరోజూ ఇంటి నుండి రుచికరమైన ఆహారాన్ని పంపేవారు. అది ఒక హోటల్ వంటలా కాకుండా, మనసుతో వండిన ప్రేమలా ఉంటుంది. ఆయన నిజంగా గొప్ప మనసున్న వ్యక్తి.. అని కితాబిచ్చారు. ఇదే సినిమాలో నటించిన మరో సహనటుడు ఉలగనాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ``ప్రభాస్ లో ఒక రకమైన స్వచ్ఛత కనిపిస్తుంది. అతడి విజయాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. కష్టపడే తత్వమే తనను గ్లోబల్ స్టార్‌ను చేసింద``ని అన్నారు.
ప్రభాస్ సెట్స్‌లో ఉంటే ఒక పండగలా ఉంటుందని దీపిక అన్నారు. మాటలు చాలా తక్కువ.. కానీ ఇచ్చే గౌరవం చాలా ఎక్కువ. షూటింగ్ సమయంలో ఆయన నా కోసం పంపిన భోజనం చూసి నేను షాక్ అయ్యాను. అంత ప్రేమను పంచడం ప్రభాస్‌కే సాధ్యం అని దీపిక పదుకొనే అన్నారు.
ప్రభాస్ అందరికీ `డార్లింగ్`. తన గురించి చెడుగా మాట్లాడే ఒక్క వ్యక్తి కూడా ఉండరు. సక్సెస్ వచ్చినా.. రాకపోయినా ఒకేలా ఉండే స్థితప్రజ్ఞత ప్రభాస్ సొంతం.. అని గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసించారు. ``ప్రభాస్ మనసు వెన్న లాంటిది. అతడు నవ్వితే చాలు.. చుట్టుపక్కల వాతావరణం అంతా మారిపోతుంది. డార్లింగ్ అని అందరూ ఎందుకు అంటారో ఆయనను కలిస్తే అర్థమవుతుంద``ని జూనియర్ ఎన్టీఆర్ ఓ సందర్భంలో అన్నారు.
నేను చాలా మంది పెద్ద స్టార్లను చూశాను కానీ ప్రభాస్ లాంటి నిరాడంబరమైన వ్యక్తిని చూడలేదని సలార్ కోస్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. తన పక్కన ఉండేవారు ఎవరైనా సరే.. వారు కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకుంటారు... అది ఆయన సంస్కారం... అని అన్నారు.
కథానాయికల ఫేవరెట్ డార్లింగ్:
ప్రభాస్ ఒక మోడరన్ డే `కర్ణుడు`. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుంటారు. ఆయన ఆతిథ్యం పొందని వారు ఇండస్ట్రీలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు! అని పూజా హెగ్డే కితాబిచ్చారు. తన క్రెడిట్‌ను కూడా పక్కన పెట్టి టీమ్ మొత్తాన్ని ముందుంచే నాయకత్వ లక్షణం ఆయనలో ఉందని తమన్నా గతంలో ప్రశంసించారు.
ప్రభాస్ సెట్స్‌లో ఉంటే మనకు భోజనం గురించి బెంగ ఉండదు. ఆయన ఇచ్చే ట్రీట్ ఒక విందు భోజనంలా ఉంటుంది. స్టార్ హోదా తలకెక్కించుకోని అతి కొద్ది మందిలో ప్రభాస్ ఒకరు అని శ్రుతి ప్రశంసించారు.
బాహుబలి, సలార్, కల్కి వంటి పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నా ప్రభాస్ తన మూలాలను మర్చిపోలేదు. అతడి విజయానికి కారణం బాహుబలం కాదు.. అందరికీ ఇచ్చే గౌరవం.. పంచే ప్రేమ. అందుకే ఇప్పుడు `యూనివర్సల్ డార్లింగ్`గా ప్రమోటయ్యాడు.
ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీని రిలీజ్ చేయించడానికి సన్నాహకాల్లో ఉన్నాడు. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సలార్ 2, కల్కి 2898 ఏడి వంటి సీక్వెల్ చిత్రాలలోను అతడు నటించాల్సి ఉంది. ప్రస్తుతం సందీప్ వంగా `స్పిరిట్` చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నాడు.
