Begin typing your search above and press return to search.

అంజి.. శక్తి.. రాజాసాబ్ గండం గట్టెక్కిస్తాడా?

అప్పట్లో చిరంజీవి అంటే బాక్సాఫీస్ కు మాస్ దేవుడు. కమర్షియల్ హంగులతో ఎలాంటి సినిమా చేసినా టాక్ తో సంబంధం లేకుండా మంచి లాభాలు వచ్చేవి.

By:  M Prashanth   |   7 Jan 2026 9:34 AM IST
అంజి.. శక్తి.. రాజాసాబ్ గండం గట్టెక్కిస్తాడా?
X

టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న స్టార్ హీరోలు తమకున్న మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి, ఫాంటసీ లేదా హర్రర్ జోనర్ లోకి అడుగుపెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'తో సరిగ్గా అలాంటి సాహసమే చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్లు, ఆ వింటేజ్ కలరింగ్, గ్రాండ్ సెట్టింగ్స్ చూస్తుంటే మెగాస్టార్ నటించిన 'అంజి' హడావుడి గుర్తుకొస్తోంది.

అప్పట్లో చిరంజీవి అంటే బాక్సాఫీస్ కు మాస్ దేవుడు. కమర్షియల్ హంగులతో ఎలాంటి సినిమా చేసినా టాక్ తో సంబంధం లేకుండా మంచి లాభాలు వచ్చేవి. అలాంటి పీక్ స్టేజ్ లో ఆయన కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'అంజి' సినిమా చేశారు. అది ఒక విజువల్ వండర్. గ్రాఫిక్స్ పరంగా అప్పటికి అదే బెంచ్ మార్క్. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా కమర్షియల్ గా దెబ్బతింది. దానికి కారణం కంటెంట్ కంటే కూడా, సినిమా నిర్మాణం సమయంలో జరిగిన జాప్యం, నిర్మాత ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులే అని అందరికీ తెలుసు. ఒక అద్భుతమైన ప్రయత్నం అప్పటి పరిస్థితుల వల్ల వికటించింది.

ఆ తర్వాత ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక భారీ ప్రయోగం చేశారు. అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన 'శక్తి' సినిమా కూడా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కిన భారీ చిత్రమే. కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీంతో స్టార్ హీరోలు ఇలాంటి అల్ట్రా నాచురల్ లేదా ఫాంటసీ సబ్జెక్టులు ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఒక భయంలా ఉండిపోయింది.

ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు టాలీవుడ్ చరిత్రలో ఆ స్థాయి గ్రాండ్ స్కేల్ ఉన్న ఫాంటసీ హారర్ మూవీగా 'ది రాజా సాబ్' వస్తోంది. ప్రభాస్ లుక్, ఆ బంగ్లా సెటప్, సినిమాలోని కలర్ ప్యాలెట్ చూస్తుంటే 'అంజి' సినిమాలోని ఆ గ్రాండియర్ గుర్తుకు వస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. 'అంజి' సీరియస్ డివైన్ ఫాంటసీ అయితే, రాజా సాబ్ 'హర్రర్ కామెడీ'. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

సాధారణంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ను సలార్, స్పిరిట్ లాంటి వైల్డ్ యాక్షన్ సినిమాల్లో చూడాలని కోరుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం రొటీన్ కి భిన్నంగా ఇలాంటి కలర్ ఫుల్ హర్రర్ డ్రామాని ఎంచుకోవడం ఒక విధంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. సంక్రాంతి కాబట్టి టాక్ కొంచెం బాగున్నా నెట్టుకురావచ్చు. కానీ ఏమాత్రం తేడా వచ్చినా మరో అంజి లాంటి దెబ్బ తప్పదు. ఏదేమైనా అంజి, శక్తి సినిమాల తర్వాత టాలీవుడ్ చూస్తున్న అతిపెద్ద ఫాంటసీ ప్రయోగం ఇదే. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి టెక్నాలజీ వేరు. మరి ప్రభాస్ ఈ 'రాజా సాబ్'తో ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేసి, స్టార్ హీరోలు ఇలాంటి జానర్ చేసినా ఆడతాయని నిరూపిస్తాడేమో చూడాలి.