Begin typing your search above and press return to search.

రాజా సాబ్ బాక్సాఫీస్.. మొదటి రోజు ఎంత?

ప్రభాస్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By:  M Prashanth   |   10 Jan 2026 10:08 AM IST
రాజా సాబ్ బాక్సాఫీస్.. మొదటి రోజు ఎంత?
X

ప్రభాస్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ది రాజా సాబ్' మూవీతో డార్లింగ్ మొదటిసారి ఒక హారర్ ఫాంటసీ వరల్డ్ లోకి వచ్చాడు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఒక రోజు ముందు నుంచే మొదలైన ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపించింది.

​హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక ఫన్ రోల్ లో కనిపించడం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రమోషన్లలో చూపించిన విజువల్స్ చూసి ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అందరూ ఊహించారు. థియేటర్ల లోపల రెస్పాన్స్ ఎలా ఉన్నా బయట మాత్రం జనం సందడి స్పష్టంగా కనిపిస్తోంది.

​ఇక అసలు విషయానికి వస్తే మొదటి రోజు వసూళ్ల పరంగా రాజా సాబ్ బాక్సాఫీస్ రికార్డులను గట్టిగానే కదిలించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఇండియాలో సుమారు 45 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో కలుపుకుంటే ఈ మొత్తం 54 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

​అయితే ఈ కలెక్షన్ల వెనుక ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల ధరల పెంపుతో సినిమా జోరు కొనసాగుతుండగా తెలంగాణలో మాత్రం హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ధరల పెంపు మెమోను కోర్టు సస్పెండ్ చేయడంతో పాత ధరలకే టికెట్లు అమ్మాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల నైజాం ఏరియాలో రావాల్సిన మొదటి వీకెండ్ వసూళ్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.

​సినిమాపై ప్రస్తుతం మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు ఫ్యాన్స్ కి ప్రభాస్ ఎనర్జీ, కామెడీ నచ్చితే.. మరికొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు ఉందని టాక్ వస్తోంది. అయితే సంక్రాంతి సెలవులు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఏదేమైనా ది రాజా సాబ్ ప్రయాణం అటు భారీ వసూళ్లు.. ఇటు చట్టపరమైన సమస్యల మధ్య సాగుతోంది. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ లాంగ్ రన్ లో ఈ సినిమా నిలబడాలంటే టాక్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా అవసరం. సెలవుల సీజన్ అడ్వాంటేజ్ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలకడగా రాణిస్తుందో వేచి చూడాలి.