ది రాజాసాబ్.. ఈసారి ముందుగానే ఓటీటీ సౌండ్!
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే మార్కెట్ లో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుంది. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, నాన్ థియేట్రికల్ బిజినెస్ లో మాత్రం ప్రభాస్ ఎప్పుడూ రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు.
By: M Prashanth | 9 Dec 2025 10:11 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే మార్కెట్ లో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుంది. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, నాన్ థియేట్రికల్ బిజినెస్ లో మాత్రం ప్రభాస్ ఎప్పుడూ రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రాజా సాబ్' విషయంలోనూ అదే జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా దీనిపై ఒక భారీ అప్డేట్ బయటకు వచ్చింది.
సాధారణంగా ఒక సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోతే, ఒక పోస్టర్ వేసో లేదా సోషల్ మీడియాలో ట్వీట్ వేసో అనౌన్స్ చేస్తారు. కానీ ప్రభాస్ సినిమా కాబట్టి వ్యవహారం చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియో హాట్ స్టార్' ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఈరోజు చెన్నైలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కేవలం ఓటీటీ పార్టనర్ ను పరిచయం చేయడానికి ఒక ఈవెంట్ నిర్వహించడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. దీన్ని బట్టే ఈ డీల్ ఎంత భారీగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. చెన్నై వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో జియో హాట్ స్టార్ ప్రతినిధులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని ప్రమోషన్ సౌండ్ ని మరింత పెంచబోతున్నారు.
ఈ కార్యక్రమానికి సినిమా బృందం నుంచి నిర్మాత టీజీ విశ్వప్రసాద్, దర్శకుడు మారుతి హాజరుకానున్నారు. స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లు కూడా ఈ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారు. గ్లామర్, బిజినెస్ కలగలిసిన ఈ వేడుక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కు తగ్గట్టుగానే ఈ అనౌన్స్ మెంట్ ను ప్లాన్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హార్రర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు జియో హాట్ స్టార్ లాంటి పెద్ద సంస్థ డిజిటల్ పార్టనర్ గా తోడవడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. రికార్డు స్థాయి ధర పలికినట్లు ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 'ది రాజా సాబ్' బిజినెస్ పరంగా అప్పుడే సంచలనాలు సృష్టిస్తోంది. ఈరోజు చెన్నైలో జరగబోయే ఈ ఈవెంట్ తో సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచినట్లవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ రాజా సాబ్, డిజిటల్ స్క్రీన్ మీద కూడా రికార్డులు కొట్టడానికి రెడీ అవుతున్నాడన్నమాట.
