రాజా సాబ్ బాక్సాఫీస్.. నైజాం, ఏపీలో ఇలా..
ఒకవైపు విమర్శకులు సినిమా కంటెంట్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా, థియేటర్ల వద్ద మాత్రం ప్రభాస్ మాస్ ఇమేజ్ గట్టిగానే పని చేస్తోంది.
By: M Prashanth | 10 Jan 2026 3:09 PM ISTసంక్రాంతి రేసులో భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపం చూపిస్తోంది. హారర్ ఫాంటసీ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చినా, వసూళ్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఒకవైపు విమర్శకులు సినిమా కంటెంట్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా, థియేటర్ల వద్ద మాత్రం ప్రభాస్ మాస్ ఇమేజ్ గట్టిగానే పని చేస్తోంది.
సినిమా రిలీజ్ కు ముందు నుంచి ఉన్న క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయేలా వచ్చాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించడం, కామెడీ టైమింగ్ తో అలరించడం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సెకండ్ హాఫ్ పై వస్తున్న విమర్శలు పక్కన పెడితే, మొదటి రోజు థియేటర్ల వద్ద జరిగిన హడావుడి మాత్రం ఈ సినిమా స్టామినాని తెలియజేస్తోంది.
టాక్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం స్టెడీగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజా సాబ్ తన బాక్సాఫీస్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. నైజాం, ఏపీలోని ప్రధాన ఏరియాల్లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. టికెట్ ధరల పెంపు, పెయిడ్ ప్రీమియర్స్ ఈ వసూళ్లకు ప్రధాన బలంగా నిలిచాయి. టాక్ లో ఉన్న నెగిటివిటీని ప్రభాస్ క్రేజ్ పూర్తిగా డామినేట్ చేసిందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు సాధించిన ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు
నైజాం: రూ.23 కోట్లు
సీడెడ్: రూ.7.3 కోట్లు
కృష్ణా జిల్లా: రూ.2.6 కోట్లకు పైగా
వెస్ట్ గోదావరి: రూ.2.97 కోట్లు
నెల్లూరు: రూ.1.65 కోట్లు
సంక్రాంతి సెలవులు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఈ వసూళ్లను మరింత పెంచే అవకాశం ఉంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై కోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే ఆ ఇంపాక్ట్ పెద్దగా కనిపించడం లేదు. గురువారం రాత్రి వేసిన ప్రీమియర్ షోల అడ్వాంటేజ్ నిర్మాతలకు బాగా కలిసొచ్చింది. ఏరియాల వారీగా వస్తున్న నెంబర్లు ఒక సూపర్ హిట్ సినిమా స్థాయికి ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి.
టాక్ కన్నా ఎక్కువగా డార్లింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కే జనాలు ఓటు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి రాజా సాబ్ బాక్సాఫీస్ ప్రయాణం టాక్ తో సంబంధం లేకుండా పరుగులు పెడుతోంది. మొదటి రోజు వచ్చిన ఈ నెంబర్లు వీకెండ్ ముగిసేసరికి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ఇతర పెద్ద సినిమాలు పోటీలోకి వచ్చే లోపు వీలైనంత ఎక్కువ కలెక్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ ఓపెనింగ్స్ సాధించిన రాజా సాబ్ ఇక మీదట ఈ స్పీడ్ ని ఎలా కొనసాగిస్తాడో చూడాలి.
