బంగారం కొట్టేశావ్ రా
ఎవరైనా సరే ఓ డైరెక్టర్ తో సినిమా చేసి ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోతే తర్వాత్తర్వాత వారితో సరైన ర్యాపో మెయిన్‌టెయిన్ చేయరు
By: Sravani Lakshmi Srungarapu | 26 Sept 2025 5:50 PM ISTఎవరైనా సరే ఓ డైరెక్టర్ తో సినిమా చేసి ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోతే తర్వాత్తర్వాత వారితో సరైన ర్యాపో మెయిన్‌టెయిన్ చేయరు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం దానికి మినహాయింపు. ప్రభాస్ హీరోగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో సాహో అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
సాహో రిలీజ్ టైమ్ లో ఫోన్ చేసి ఓదార్చారు
ఎన్నో అంచనాలతో తెరకెక్కిన సాహో రిలీజయ్యాక అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రభాస్ లాంటి హీరోను పెట్టుకుని కూడా సుజిత్ ఏం చేయలేకపోయాడని అందరూ అతన్ని విమర్శించారు. కానీ ప్రభాస్ మాత్రం సుజిత్ పట్ల ఎప్పుడూ దయతోనే వ్యవహరించేవారని, సాహో రిలీజ్ నాడు తాను హైదరాబాద్ లో లేనని, ఆ టైమ్ లో ప్రభాస్ తనకు ఫోన్ చేసి ఓదార్చడంతో పాటూ బాధపడొద్దని చెప్పారని సుజిత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కొడతావ్ రా నువ్వు అని ముందే చెప్పారు
అంతేకాదు, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజి సినిమా విషయంలో కూడా తనకు ప్రభాస్ ఎంతో సపోర్ట్ గా నిలిచారని, రిలీజ్ కు ముందు రోజు ప్రభాస్ కు ఓజి రిలీజ్ అనే విషయం చెప్పడానికి ఫోన్ చేశానని, అప్పుడు ప్రభాస్ తనతో కొడతావ్ రా నువ్వు అని చెప్పి తనలో కాన్ఫిడెన్స్ ను పెంచారని తెలిపారు. ఓజి రిజల్ట్ విషయంలో సుజిత్ మొదటినుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ ప్రభాస్ చెప్పిన మాటలు తనకు మంచి బూస్టప్ ను ఇచ్చాయని అతను పేర్కొన్నారు.
సెప్టెంబర్ 25న ఓజి ప్రపంచవ్యాప్తంగా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుండగా, సినిమా రిలీజ్ రోజు ప్రభాస్ సుజిత్ కు బంగారం కొట్టేశావ్ రా అంటూ మెసేజ్ చేశారని, అప్పటివరకు ఎంతమంది చెప్పినా రాని ఆనందం, ప్రభాస్ మెసేజ్ చూశాక నిజంగానే తాను బ్లాక్ బస్టర్ కొట్టాననే ఫీలింగ్ కలిగిందని సుజిత్ వెల్లడించారు.
