స్పిరిట్ టైటిల్ కాంట్రవర్సీ.. ఇప్పుడు ప్రొడ్యూసర్ భర్త వార్నింగ్..
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం స్పిరిట్ సెట్స్ పైకి ఉండగా.. టైటిల్ వివాదం హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 14 July 2026 4:01 PM ISTప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం స్పిరిట్ సెట్స్ పైకి ఉండగా.. టైటిల్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ వివాదం ముదిరి, నిర్మాత కుటుంబం నుంచి హెచ్చరికలు రావడం చర్చనీయాంశమైమంది. స్పిరిట్- ఈజ్ నాట్ వన్ టైటిల్ తో 8త్ వండర్ సినిమాస్ బ్యానర్ పై మహిళా రైతు నర్సమ్మ నిర్మించిన సినిమా కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఆ చిత్రానికి వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వం వహించారు.
ఆ సినిమా టైటిల్ ను ప్రభాస్ మూవీ ప్రకటించకముందే రిజిస్టర్ చేయించుకున్నామని కొంతకాలంగా నిర్మాత నర్సమ్మ చెబుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించామని, విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక టీ-సిరీస్ తరఫున లీగల్ నోటీసులు వచ్చాయని ఆరోపించారు. భూషణ్ కుమార్ పేరుతో వచ్చిన నోటీసుల్లో విడుదల నిలిపివేయాలని, ప్రమోషన్స్ చేపట్టొద్దని పేర్కొన్నట్లు చెప్పారు.
సందీప్ మేనేజర్ ద్వారా తమ వివరాలు సేకరించి నోటీసులు పంపించారని కూడా ఆమె ఆరోపించారు. తాము చిన్న నిర్మాతలమని, మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవచ్చు గానీ నేరుగా కోర్టు నోటీసులు పంపించడం వల్ల భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టైటిల్ మార్చుకోవడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే ముందుగా సంప్రదించి ఉంటే మరో పేరుతో సినిమా విడుదల చేసుకునేవాళ్లమని నర్సమ్మ తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా నర్సమ్మ భర్త చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. కొన్ని రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగా తరఫున సినిమా విడుదల చేసుకోవచ్చని చెప్పినా, ఆ తర్వాత మరోసారి టీ-సిరీస్ ద్వారా కొత్త నోటీసు వచ్చిందని ఆయన తెలిపారు. ఆ నోటీసులో సినిమా రిలీజ్ కు అభ్యంతరం లేదని, అయితే పోస్టర్లు వేయకూడదని, ప్రచారం చేయకూడదని, ఓటీటీకి విక్రయించకూడదనే షరతులతో అంగీకార పత్రంపై సంతకం చేయాలని కోరినట్లు వెల్లడించారు.
తాము ముందుగానే స్పిరిట్ టైటిల్ నమోదు చేసుకున్నామని, అలాంటప్పుడు తమ సినిమాపై కండీషన్స్ విధించే హక్కు ఎవరికుందని ఆయన ప్రశ్నించారు. తమ చిత్రానికి అవసరమైన అన్ని అనుమతులు, సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఉన్నాయని, అయినా విడుదలను అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు. తమ సినిమా కథకు ప్రభాస్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, అక్కడ పోలీస్ నేపథ్యం ఉంటే తమ సినిమాలో దేవుళ్లు, దెయ్యాల అంశాలు ఉంటాయని వివరించారు. అంతేకాకుండా, చర్చలకు రాకుండా కేవలం నోటీసులతో ఒత్తిడి తీసుకురావడం బాధాకరమని అన్నారు.
"మా జోలికి ఎవరూ రావొద్దు. మా సినిమా విడుదలయ్యే వరకు ప్రభాస్ స్పిరిట్ విడుదలకు ప్రయత్నిస్తే మేమూ అడ్డుకుంటాం" అంటూ హెచ్చరిక చేశారు. ఆ వివాదంపై ఇప్పటివరకు టీ-సిరీస్, సందీప్ రెడ్డి వంగా లేదా ప్రభాస్ టీమ్ నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే చిన్న సినిమా టైటిల్ వివాదం ఇప్పుడు లీగల్ అంశాన్ని దాటి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకోవడంతో.. ఇరుపక్షాలు చర్చల ద్వారా ప్రాబ్లం సాల్వ్ కనుగొంటాయా? లేక కోర్టు వరకు వెళ్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
