ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా వార్తలపై టి-సిరీస్ క్లారిటీ
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ - పవర్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం `స్పిరిట్` విడుదల తేదీపై ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు సహా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
By: Sivaji Kontham | 19 Aug 2026 9:30 AM ISTపాన్-ఇండియా స్టార్ ప్రభాస్ - పవర్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం `స్పిరిట్` విడుదల తేదీపై ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు సహా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రం ఈద్ 2027 రేసు నుంచి తప్పుకుందని.. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండటం వల్ల జూన్ 2027కి వాయిదా పడే అవకాశం ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రముఖ హిందీ పోర్టల్‌లో వచ్చిన ఈ వాయిదా వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ టి-సిరీస్ గట్టిగా ఖండించడంతో ఈ వ్యవహారంలో స్పష్టత వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. `స్పిరిట్` చిత్రీకరణకు సంబంధించి ఇంకా దాదాపు 75 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం.. అతడి కాల్షీట్లు వేర్వేరు సినిమాలకు కేటాయించాల్సి రావడం వల్ల ఈద్ 2027 నాటికి చిత్రీకరణ పూర్తి చేయడం సందీప్ రెడ్డి వంగాకు సవాలుగా మారనుందని గుసగుసలు వినిపించాయి. ఈ కారణంతోనే టి-సిరీస్ నిర్మాతలు ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కథనాలొచ్చాయి.
ఒకవేళ `స్పిరిట్` ఈద్ బరి నుంచి తప్పుకుంటే.. అదే సమయంలో విడుదలకు వస్తున్న సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ చిత్రానికి సోలో రిలీజ్ దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపించాయి. రెండు భారీ పాన్-ఇండియా సినిమాల మధ్య ఎదురయ్యే అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్ ని ఆపేందుకు అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడ్డాయి. బాలీవుడ్‌లో సల్మాన్‌కు అత్యంత కీలకమైన పండుగ సీజన్ ఈద్ కావడంతో.. `స్పిరిట్` వాయిదా ఆయన సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు కలిసొచ్చే అంశంగా మారేదని భావించారు.
అయితే ఈ విశ్లేషణలు .. వాయిదా రూమర్లపై టి-సిరీస్ ప్రతినిధి వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చినట్టు బాలీవుడ్ హంగామా తన కథనంలో పేర్కొంది. ``మేం స్పిరిట్ సినిమా విడుదల ప్రణాళిక ప్రకారమే వేగంగా ముందుకు వెళ్తున్నాం. ముందుగా ప్రకటించిన విధంగానే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి పనులు జరుగుతున్నాయి. విడుదల తేదీలో ఎలాంటి మార్పూ లేదు!`` అని అధికారికంగా స్పష్టం చేసినట్టు సదరు కథనం పేర్కొంది. దీంతో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వాయిదా వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
సందీప్ రెడ్డి వంగా శైలికి ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడవ్వడంతో `స్పిరిట్` పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలేర్పడ్డాయి. పెద్ద బడ్జెట్ సినిమాలకు మేకింగ్ పరంగా ఆలస్యాలు సహజమే అయినా మేకర్స్ ఇప్పుడే స్పష్టత ఇవ్వడం ద్వారా బిజినెస్ సహా ఫ్యాన్స్ హైప్‌కి ఎలాంటి అడ్డంకులు కలగకుండా చూసుకున్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం 5 మార్చి 2027 న బాక్సాఫీస్ వద్ద `స్పిరిట్` ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచి చూడాలి. అలాగే ప్రముఖ తెలుగు మీడియా చానెల్ ప్రతినిధి సోర్స్ ప్రకారం.. `స్పిరిట్` వాయిదా పడేందుకు ఆస్కారం లేదని కూడా ఒక క్లారిటీ వచ్చింది.
