100 మంది ఫైటర్లతో ప్రభాస్ మాస్ ఫైట్.. థియేటర్‌లో పూనకాలే!
రెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్`. ఈ కాంబో సినిమా ప్రకటించినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి.
By: Sivaji Kontham | 5 July 2026 11:33 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్`. ఈ కాంబో సినిమా ప్రకటించినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక మైండ్ బ్లాంక్ అయ్యే క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ కాప్ డ్రామాలో ఎవరూ ఊహించని విధంగా ఒక భారీ ట్విస్ట్‌ను వంగా ప్లాన్ చేశాడట. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ టోటల్ ప్రాజెక్ట్‌కే ఒక మేజర్ హైలైట్‌గా నిలవబోతోందని సమాచారం.
ప్రస్తుతం మూవీలోని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చిత్ర యూనిట్ భారీ సెట్స్ వేస్తోందని తెలుస్తోంది. దాదాపు 100 మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయి ఫైటర్లతో ప్రభాస్ చేసే ఒక హై-వోల్టేజ్ మాస్ ఫైట్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. `స్పిరిట్` కథలో ప్రభాస్ కేవలం ఒక పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా మాత్రమే కనిపిస్తారని భావిస్తున్న తరుణంలో.. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఆ ఒక్క ట్విస్ట్ ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుందని.. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత భారీ యాక్షన్ షెడ్యూల్ ముగిసిన వెంటనే.. తదుపరి షెడ్యూల్‌లో సినిమా క్లైమాక్స్ పార్ట్‌ను కూడా షూట్ చేయడానికి వంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రభాస్ అధికారిక ఇన్‌స్టా ఖాతా ద్వారా `స్పిరిట్` ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై చాలా కాలమే అయింది. ఆ పోస్టర్‌లో తృప్తి డిమ్రి తో ప్రభాస్ కెమిస్ట్రీ హీట్ పుట్టించింది. అయితే ఆ తర్వాత సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్‌లో మళ్లీ ఎప్పుడు జోరు పెంచుతాడా? నెక్ట్స్ అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా `స్పిరిట్` కొత్త టీజర్ రాక కోసమే చర్చలు నడుస్తున్నాయి.
అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ అక్టోబర్ 23న ఒక భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే (పుట్టినరోజు) కానుకగా ఫ్యాన్స్ కి ఏదైనా స్పెషల్ అందించాలని వంగా ఆలోచిస్తున్నారట. బాహుబలి, కల్కి 2898 ఏడీ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `రెబల్ స్టార్` పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్ రూపంలో ఒక సాలిడ్ అప్‌డేట్ అందాలనేది స్పిరిట్ టీమ్ ఆలోచన. వంగా ఈ టీజర్ ద్వారా ఎలాంటి చర్చలకు తెరలేపుతుడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
భూషణ్ కుమార్ టి-సిరీస్ -సందీప్ వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ తెలుగు, హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే లాక్ అయింది. `స్పిరిట్` చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ కంటే ముందే.. ఈ ఏడాది ప్రభాస్ బర్త్‌డే అప్‌డేట్‌తోనే `స్పిరిట్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హైప్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.
