Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ అయితేనే కాపాడ‌గ‌ల‌రు.. రైతు మ‌హిళా నిర్మాత ఆవేద‌న‌

ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో సందీప్ వంగా తెర‌కెక్కిస్తున్న స్పిరిట్ కంటే ముందే అదే టైటిల్ తో మేం మ‌రో సినిమా తీసేసామ‌ని చెబుతున్నారు మహిళా నిర్మాత నర్సమ్మ - ఆమె కుమారుడు రవి కుమార్.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 5:47 PM IST
ప్ర‌భాస్ అయితేనే కాపాడ‌గ‌ల‌రు.. రైతు మ‌హిళా నిర్మాత ఆవేద‌న‌
X

ఒకే టైటిల్ తో రెండు సినిమాలు తెర‌కెక్కిన‌ప్పుడు మొద‌ల‌య్యే వివాదాలను టాలీవుడ్ చాలా చూసింది. ఇప్పుడు అలాంటి మ‌రో గొడ‌వ `స్పిరిట్` విష‌యంలోను ఎదురైంది. ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో సందీప్ వంగా తెర‌కెక్కిస్తున్న స్పిరిట్ కంటే ముందే అదే టైటిల్ తో మేం మ‌రో సినిమా తీసేసామ‌ని చెబుతున్నారు మహిళా నిర్మాత నర్సమ్మ - ఆమె కుమారుడు రవి కుమార్.

తమ `స్పిరిట్- ఈస్ నాట్ వన్` అనే టైటిల్‌ను ఫిబ్రవరి 2024లోనే ఫిల్మ్ ఛాంబర్‌లో అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నట్లు నిర్మాత న‌ర‌స‌మ్మ తెలిపారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా - టీ-సిరీస్ సంస్థ తమ సినిమా కోసం ఈ టైటిల్ నమోదు చేయడానికి రెండు నెలల ముందే తాము రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నామని వారు పేర్కొన్నారు.

తాము చట్టబద్ధంగా టైటిల్ రిజిస్ట‌ర్ చేసినా టీ-సిరీస్ - సందీప్ వంగా బృందం నుండి తమకు లీగల్ నోటీసులు రావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన చెందారు. పెద్ద సంస్థలైన టీ-సిరీస్, సందీప్ రెడ్డి వంగా కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తమ చిన్న సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ లీగల్ నోటీసులు, వివాదాల కారణంగా తమ సినిమా రిలీజ్ ఆగిపోయిందని.. దీనివల్ల తాము ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని నిర్మాత నర్సమ్మ కన్నీరు పెట్టుకున్నారు. తాము ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చామని, సినిమాపై ఉన్న ఆసక్తితో కష్టపడి సంపాదించిన డబ్బుతో పాటు భారీగా అప్పులు చేసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని వారు వెల్లడించారు. పెద్ద కార్పొరేట్ సంస్థల ఒత్తిడిని, లీగల్ పోరాటాలను తట్టుకోలేక తమ కుటుంబం తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్ హీరోగా రాబోయే 'స్పిరిట్' సినిమాకు ఉన్న విపరీతమైన క్రేజ్ -ప్రమోషనల్ మొమెంటంను వాడుకుని తమను లీగల్‌గా అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

గ‌త మూడేళ్లుగా మీడియాలో బోలెడంత ప్ర‌మోష‌న్స్ చేసాం. మీడియా చానెళ్ల‌లో ఇంట‌ర్వ్యూలు చేసాం. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధం చేసాం. అప్ప‌టివ‌ర‌కూ స‌పోర్ట్ చేసిన సంస్థ‌లు కూడా ఇప్పుడు వెన‌క్కి వెళ్లిపోయాయ‌ని నిర్మాత న‌ర‌స‌మ్మ ఆవేద‌న చెంద‌గా, త‌మ‌ త‌ర‌పున‌ లీగ‌ల్ నోటీస్ ఇచ్చిన లాయ‌ర్ కూడా వెళ్లిపోయాడు! అంటూ నిర్మాత కుమారుడు ర‌వికుమార్ ఆవేద‌న వ్య‌క్త‌ప‌రిచారు.

అంతేకాదు.. ప్రభాస్ మాత్రమే త‌మ‌ను కాపాడగలరని మ‌హిళా రైతు నిర్మాత న‌ర‌స‌మ్మ‌ విజ్ఞప్తి చేయ‌డం కొస‌మెరుపు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంతో మంచి మనసున్న వ్యక్తని, పరిశ్రమలో చిన్న నిర్మాతలను ఆదుకునే గుణం ఆయనకు ఉందని.. కాబట్టి ఈ వివాదంలో జోక్యం చేసుకుని తమ లాంటి పేద రైతు కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా వారు ప్రభాస్‌కు హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు.

మేక‌లు- గొర్రెలు అమ్మి....

ఈ వివాదంలో అస‌లు విష‌యం వేరొక‌టి ఉంది. `స్పిరిట్ - ఈజ్ నాట్ వ‌న్` సినిమా నిర్మాణం కోసం త‌మ‌కు ఉన్న మేక‌లు, గొర్రెలు అన్నిటినీ అమ్మేసామ‌ని, ఆస్తుల‌ను అమ్మి పెట్టుబ‌డులు పెట్టామ‌ని కూడా నిర్మాత న‌ర‌స‌మ్మ త‌న వ్య‌థ‌ను దాచుకోకుండా బ‌హిరంగంగా చెప్పుకొచ్చారు. ప్ర‌భాస్ కానీ, నిర్మాత‌లు కానీ రెండేళ్ల క్రిత‌మే ఈ టైటిల్ త‌మ‌కు ఇవ్వాల్సిందిగా ప్రేమ‌గా అడిగి ఉంటే అప్పుడే ఇచ్చేసేవాళ్ల‌మ‌ని, కానీ ఇప్పుడు రిలీజ్ ముంగిట చ‌ట్ట‌ప‌రంగా వేధింపుల‌కు గురి చేయ‌డం స‌రికాద‌ని కూడా నిర్మాత ఆవేద‌న చెందారు. ఈ వివాదాన్ని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకునేందుకు ప్ర‌భాస్ ఇన్వాల్వ్ అవ్వాల‌ని వారు కోరుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ సందీప్ వంగా కానీ, ప్ర‌భాస్ కానీ స్పందించ‌లేదు.