Begin typing your search above and press return to search.

టైటిల్ వివాదం: మేం కేసు వేస్తే ప్ర‌భాస్ 'స్పిరిట్' రిలీజ‌వ్వ‌దు!

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `స్పిరిట్`.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 9:26 AM IST
టైటిల్ వివాదం: మేం కేసు వేస్తే ప్ర‌భాస్ స్పిరిట్ రిలీజ‌వ్వ‌దు!
X

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `స్పిరిట్`. టి-సిరీస్ అత్యంత‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం కొంత‌కాలంగా ఊహించని లీగల్ వివాదంలో చిక్కుకుంది. `స్పిరిట్ (ఈజ్ నాట్ వన్)` అనే చిన్న సినిమా టైటిల్‌తో ముడిపడిన ఈ వివాదం.. లీగల్ వార్‌గా రూపాంతరం చెంది కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతోంది.

ఈ వివాదం వెనుక ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన మహిళా నిర్మాత ఆవేదన దాగి ఉంది. నిర్మాత నరసమ్మ తన గొర్రెలు, మేకలు, ఆస్తులను అమ్ముకుని ఎంతో కష్టపడి `స్పిరిట్ (ఈజ్ నాట్ వన్)` అనే సినిమాను నిర్మించామ‌ని చెబుతున్నారు.

తాజాగా ఈ సినిమా కథానాయకుడు, నిర్మాత నరసమ్మ కుమారుడు రవి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్-సందీప్ వంగా `స్పిరిట్` బృందంపై సంచలన వ్యాఖ్య‌లు చేసారు. మ‌మ్మ‌ల్ని సినిమా రిలీజ్ చేయొద్దంటున్నార‌ని, క్రిమిన‌ల్ కేసు వేస్తామ‌ని అంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. 2024 ఏప్రిల్‌లో సందీప్ వంగా టీమ్ `స్పిరిట్` టైటిల్‌ను రిజిస్టర్ చేసుకోగా, అంతకంటే రెండు నెలల ముందే (ఫిబ్రవరి 2024లో) తాము చాంబర్‌లో `స్పిరిట్` టైటిల్‌ను అధికారికంగా రిజిస్టర్ చేయించామని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా టైటిల్ తమదే అయినా, ఇంటి అడ్రెస్ అడిగి తీసుకుని మ‌రీ టి-సిరీస్ వారు తమకు లీగల్ నోటీసులు పంపించి సినిమాను అన్యాయంగా ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా లాయర్‌ను పెట్టుకుని వారి నోటీసులకు రిప్లై నోటీస్ పంపించామని, ఇప్పుడు వారు రెండో నోటీస్ పంపేందుకు సిద్ధమవుతున్నారని రవి పేర్కొన్నారు.

తాము లీగల్ పోరాటానికి వెళ్తుండటంతో ప్రభాస్ `స్పిరిట్` బృందంలో కంగారు మొదలైందని రవి అన్నారు. వంగా మేనేజర్ తమ ఇంటి అడ్రస్ అడిగితే ఇచ్చామని, కానీ తాము సందీప్ వంగా లేదా ప్రభాస్ అడ్రస్ అడిగితే ఇవ్వడానికి నిరాకరించారని రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తాము టి-సిరీస్‌పై కోర్టులో కేసు వేస్తే ప్రభాస్ సినిమా విడుదల ఆగడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎయిత్ వండర్ బ్యానర్‌పై తాము నిర్మించిన సినిమా మొద‌ట టైటిల్ రిజిస్ట‌ర్ చేసుకుని, ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉందని, కాబట్టి చట్టపరంగా తమకే పూర్తి హక్కులు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ వివాదం వెనుక బ్యాక్ డోర్ సెటిల్‌మెంట్ వ్యూహాలు నడుస్తున్నాయని రవి ఆరోపించారు. నరసమ్మ, టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మధ్య వివాదం నడుస్తుండగా.. దర్శకుడు సందీప్ వంగా ఇందులో జోక్యం చేసుకుని టి-సిరీస్‌తో మాట్లాడుతారని తాను ఊహిస్తున్నట్లు చెప్పారు. ``ఇండస్ట్రీలో నాకు ఒక పేరు ఉంది. ఇక్కడ హీరోకు ఒక ఇమేజ్ ఉంది.. కాబట్టి మీరు డ్రాప్ అయిపోండి. నేను సినిమా తీసుకుని రిలీజ్ చేస్తాను. బ్యాక్ డోర్‌లో మీకు డబ్బులిస్తాను`` అంటూ టీసిరీస్ వాళ్ల‌తో వంగా మాట్లాడుకుంటార‌ని సందేహం వెలిబుచ్చారు.

ఒక సాధారణ రైతు కుటుంబం తీసిన సినిమా వల్ల ప్రభాస్ చిత్రానికి వస్తున్న ఉచిత పబ్లిసిటీని కూడా వారు వాడుకుంటున్నారని రవి వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారం సందీప్ వంగాకు, ఆయన సోదరుడికి తెలుసని, ప్రభాస్ గారికి తెలిస్తే తప్పకుండా బాధపడతారని రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం పూర్తిగా కోర్టు బాట ప‌డుతుందా లేక ఛాంబ‌ర్ జోక్యంతో సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకుంటారా? అన్న‌ది వేచి చూడాలి.