ప్రభాస్‌కి లైన్ క్లియర్ చేయాల్సినది ఎన్టీఆరే!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన `సలార్` బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
By: Sivaji Kontham | 18 Aug 2026 6:00 AM ISTపాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన `సలార్` బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ హిట్‌కి సీక్వెల్‌గా రాబోతున్న `సలార్ 2` కోసం రెబల్ స్టార్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సీక్వెల్ పనులపై దృష్టి సారించడం డార్లింగ్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. పాన్ ఇండియా డైరెక్టర్‌గా దూసుకుపోతున్న నీల్‌తో ప్రభాస్ తిరిగి వర్క్ చేసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు శరవేగంగా పూర్తికావలసి ఉంది. `ఫౌజీ`తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న `స్పిరిట్` పనులను ఏప్రిల్ 2027 నాటికి ముగించేస్తే.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ `సలార్ 2` ఫైనల్ స్క్రిప్ట్‌కు ప్రభాస్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు `కల్కి 2898 ఏడీ` సీక్వెల్‌తో పాటు `సలార్ 2`ను కూడా పట్టాలెక్కించేందుకు ప్రభాస్ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ వేగవంతం కావడంలో ఎన్టీఆర్ పాత్ర కూడా కీలకంగా మారింది. ఇటీవల ఊహించని గాయం కారణంగా ఎన్టీఆర్ తన `డ్రాగన్` మూవీ చిత్రీకరణకు 2 నుంచి 3 నెలల పాటు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లోనే ప్రశాంత్ నీల్ `సలార్ 2` స్క్రిప్టును పూర్తి చేసే పనిలో పడ్డారు. టాలీవుడ్ బెస్ట్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్‌లను సరిగ్గా ఎంగేజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ తన ప్లానింగ్‌ను ముందుకు నడిపిస్తున్నారు. గాయం నుంచి ఎన్టీఆర్ త్వరగా కోలుకుని అనుకున్న షెడ్యూల్ ప్రకారం `డ్రాగన్` షూటింగ్‌ను పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేస్తేనే.. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో ముందుకు సాగేందుకు మార్గం సుగమం అవుతుంది.
సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ రావడం ఎంత మాత్రం ఆలస్యం కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రం 2027-28 సీజన్‌లో విడుదలయితే `కేజీఎఫ్ 2`, `పుష్ప 2` తరహాలో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టే అవకాశం ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు, ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్- ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయితే లైనప్ సులభతరం అవుతుంది.
మొత్తానికి ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలైన `కల్కి 2`, `సలార్ 2`లను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ రెండింటినీ వేగంగా పూర్తి చేసి అభిమానులకు బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ ట్రీట్ ఇస్తారని అంతా ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకుని డ్రాగన్ పూర్తి చేస్తే... ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో పట్టాలెక్కడానికి లైన్ క్లియర్ అయినట్టేనని పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
