Begin typing your search above and press return to search.

ప్రభాస్ లేకుంటే.. ఆ సినిమా షెడ్డుకేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌ లో ఎన్నో బ్లాక్‌ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ, అభిమానులు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడని కొన్ని మూవీలు కూడా ఉన్నాయి.

By:  M Prashanth   |   14 Jun 2026 5:00 AM IST
ప్రభాస్ లేకుంటే.. ఆ సినిమా షెడ్డుకేనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌ లో ఎన్నో బ్లాక్‌ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ, అభిమానులు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడని కొన్ని మూవీలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకునే పేరు రెబల్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. అయితే తాజాగా ఆ సినిమా వెనుక జరిగిన విషయాల గురించి నిర్మాతలు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

దర్శకుడు రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఆ సినిమాలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. 2012 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పట్లో భారీ బడ్జెట్‌ తో రూపొందిన ఆ సినిమా.. వసూళ్ల పరంగా వెనుకబడటంతో ప్రభాస్ కెరీర్‌ లోని పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

ఇటీవల రెబల్ నిర్మాతలు జే భగవాన్, జే పుల్లారావు సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన కష్టాలు గుర్తు చేసుకున్నారు. వారు చెప్పిన విషయాలు చూస్తే, రెబల్ విడుదల కావడమే ఒక పెద్ద సవాల్‌ గా మారిందని అర్థమవుతోంది. సినిమాను ప్రారంభించినప్పుడు ఒక బడ్జెట్‌ అనుకుని ముందుకెళ్లామని, ఒప్పందాలు కూడా చేసుకున్నామని నిర్మాతలు తెలిపారు.

కానీ షూటింగ్ సగం పూర్తయ్యే సమయానికి అనుకున్న మొత్తం ఖర్చు అయిపోయిందని వెల్లడించారు. ఇంకా సగం సినిమా చిత్రీకరించాల్సి ఉండటంతో పరిస్థితి మారిందని చెప్పారు. సినిమా పూర్తయ్యే సమయానికి ఖర్చు దాదాపు డబుల్ అయ్యిందని వారు పేర్కొన్నారు. దీంతో ఇండస్ట్రీలో కూడా మూవీ కంప్లీట్ అవుతుందా? విడుదల అవుతుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు.

నిర్మాతలుగా తమకు అప్పటికే నష్టం తప్పదనే విషయం అర్థమైందని, అయినప్పటికీ వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఆ మొత్తం జర్నీలో ప్రభాస్ హెల్ప్ ను నిర్మాతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా విడుదలయ్యే వరకు ఆయన పూర్తిగా అండగా నిలిచారని తెలిపారు. కష్టకాలంలో హీరో సహకారం తమకు ఎంతో ధైర్యం ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ప్రభాస్ మద్దతు లేకపోయి ఉంటే సినిమా మధ్యలో ఆగిపోయేదేమో అన్న భావన వారి మాటల్లో కనిపించింది.

అదే సమయంలో దర్శకుడు రాఘవ లారెన్స్ పనితీరుపై నిర్మాతలు స్పందించారు. ఆయన తనకు కావాల్సిన విషయంలో రాజీపడే వ్యక్తి కాదని చెప్పారు. సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి తగ్గింపులు అంగీకరించరని తెలిపారు. అయితే బడ్జెట్ పరంగా అది నిర్మాతలకు భారంగా మారిందని వెల్లడించారు. అయినా సరే, మొదటి రోజు ముహూర్తం సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నామో, చివరి వరకు అలాగే సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని చెప్పారు.

రిజల్ట్ నిరాశపరిచినా, నిర్మాతలుగా తమ బాధ్యత నుంచి వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రెబల్ గురించి అభిమానులు మాట్లాడుకునేది కేవలం దాని రిజల్ట్ గురించే. కానీ నిర్మాతల లేటెస్ట్ కామెంట్స్ చూస్తే, ఆ సినిమా వెనుక ఎన్నో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ దాగి ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ కోపరేషన్ లేకపోయి ఉంటే రెబల్ రిలీజ్ కాకుండా, మధ్యలో షెడ్డుకెళ్లిపోయేదన్న చర్చ జరుగుతోంది.