అన్నా.. నీ కంటే ఒక సినిమా ఎక్కువే చేశా!
రీసెంట్ గా యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌లో రూపొందిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ థియేటర్లలో మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Feb 2026 8:00 PM ISTటాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా ప్రత్యేక గుర్తింపు పొందిన యూవీ క్రియేషన్స్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సన్నిహితులతో కలిసి ఈ బ్యానర్‌ను స్థాపించడమే కాకుండా, తన కెరీర్‌లో కీలకమైన సినిమాలను కూడా ఇదే బ్యానర్ ద్వారా అందించారు. అందుకే సినీ వర్గాల్లో యూవీ అంటే ప్రభాస్ బ్యానర్ అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో మాత్రమే కాకుండా, ఇతర హీరోలతో కూడా విభిన్న కథాంశాలపై సినిమాలు నిర్మిస్తూ తన వైవిధ్యాన్ని చాటుకుంటోంది.
సినిమా హిట్టైతే అడిగిన గిఫ్ట్ ఇదే!
రీసెంట్ గా యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌లో రూపొందిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ థియేటర్లలో మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ప్రభాస్‌తో ఓ చిట్‌చాట్ నిర్వహించింది. ఆ సంభాషణలో చోటుచేసుకున్న సరదా క్షణాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మామూలుగా ఈ మధ్య ఏదైనా సినిమా హిట్టైతే డైరెక్టర్ కు నిర్మాత కార్ గిఫ్ట్ గా ఇవ్వడం లాంటివి చూస్తూ ఉన్నాం. అయితే ఈ సినిమా హిట్టైతే ఒకటి చేయాలని తాను నిర్మాతను ముందే అడిగానని, అది ప్రభాస్ తో ఇంటర్వ్యూ అని సంతోష్ శోభన్ వెల్లడించాడు.
అన్న ఫోన్ నెంబర్ లేదు
చిట్ చాట్ లో భాగంగా సంతోష్ శోభన్ తనకు యూవీ హోమ్ బ్యానర్ లాంటిదని, ఇది తనకు యూవీలో నాలుగో సినిమా అని, అన్నా… నీకంటే ఒక సినిమా ఎక్కువ చేశా” అంటూ ప్రభాస్‌ను సరదాగా ఆటపట్టించాడు. దానికి ప్రభాస్ రెస్పాండ్ అవుతూ, ఇంకా చాలా సినిమాలు చేస్తావు. నిన్ను వాళ్లు వదలరు… నువ్వు వాళ్లను వదలవు అంటూ చమత్కరించారు. యూవీ బ్యానర్ నుంచి సినిమా వస్తే ఆడియన్స్ నుంచి, ముఖ్యంగా మీ ఫ్యాన్స్ నుంచి తప్పనిసరిగా మద్దతు వస్తుందని సంతోష్ ఈ సందర్భంగా ప్రభాస్ తో చెప్పారు. ఈ సందర్భంగా సంతోష్ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా ఆ సంభాషణ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తానెక్కడికి వెళ్లినా ప్రభాస్ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి, “అన్నకు ఇది చెప్పండి, అది చెప్పండి” అని అడుగుతుంటారని.. కానీ, తన వద్ద ప్రభాస్ అన్న ఫోన్ నంబర్ లేదని ఆయన సరదాగా చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.
ఇబ్బంది పెడితే తంతా
ఈ విషయంపై వెంటనే ప్రభాస్ స్పందిస్తూ, నువ్వు అసలే మొహమాటస్తుడివి. వాళ్లు అడిగారు కదా అని కాల్ చేస్తావ్. నీకు అసలు నెంబర్ ఇవ్వనంటూ చమత్కరించి, తర్వాత వెంటనే మరీ తప్పదు అనిపిస్తే మాత్రమే ఫోన్ చెయ్. ఇబ్బంది పెట్టకు. నీకు నెంబర్ ఇస్తానని చెప్పి సంతోష్ ఫోన్‌లో తన నెంబర్ ను నోట్ చేశారు. నెంబర్ ఉందని ఎక్కువగా ఇబ్బంది పెడితే మాత్రం తంతానంటూ కూడా ప్రభాస్ హెచ్చరించారు.
ఏడాదికి 3 సినిమాలు చేస్తున్నా.. కానీ!
ఇదే సంభాషణలో భాగంగా ప్రభాస్ తన సినిమాల గురించి కూడా ప్రస్తావించారు. ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేస్తున్నానని, ఫ్యాన్స్ కావాలి కావాలి అంటున్నారని కష్టపడి సంవత్సరానికి 3 సినిమాలు చేస్తున్నానని కానీ రిలీజ్ లు మాత్రం ఒకటీ, రెండు సినిమాలే అవుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. బాహుబలి సినిమాకు ఎక్కువ టైమ్ కేటాయించడంతో ఒక్కో సినిమాకూ ఇన్నేళ్లా అని డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కు ప్రభాస్ గతంలో ఏడాదికి మూడు సినిమాలు చేస్తానని మాటిచ్చిన విషయం తెలిసిందే. ఆ మాట ప్రకారమే ప్రభాస్ కష్టపడుతున్నారు కానీ ఏదొక కారణంతో ఆ సినిమాలు ఆలస్యంగా రిలీజవుతున్నాయి. రీసెంట్ గా రాజా సాబ్ తో ప్రేక్షకుల్ని పలకరించిన డార్లింగ్, ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
