బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ 'రాజసం'!
ప్రస్తుతం రీ రిలీజ్ మార్కెట్ లెక్కలు చూస్తుంటే, ప్రభాస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది.
By: M Prashanth | 20 Nov 2025 11:47 AM ISTసాధారణంగా స్టార్ హీరోల మధ్య పోటీ ఎక్కడ ఉంటుంది? కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు, మొదటి రోజు కలెక్షన్ల దగ్గర ఉంటుంది. కానీ, ప్రభాస్ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా వేరు. ఆయన కొత్త సినిమాలే కాదు, పాత సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్నాయి. రీ రిలీజ్ ట్రెండ్ లో మిగతా హీరోలు కేవలం ఫ్యాన్స్ హంగామా కోసం సినిమాలు వేస్తుంటే, ప్రభాస్ సినిమాలు మాత్రం కమర్షియల్ గా కూడా సత్తా చాటుతూ, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తున్నాయి.
ప్రస్తుతం రీ రిలీజ్ మార్కెట్ లెక్కలు చూస్తుంటే, ప్రభాస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్న సినిమాకు, మిగిలిన వాటికి మధ్య ఉన్న అంతరం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇండియన్ సినిమా గతిని మార్చిన ఆ ఒక్క సినిమా, మళ్ళీ మళ్ళీ థియేటర్లకు జనాన్ని రప్పిస్తూనే ఉంది. అదే 'బాహుబలి'. ఇది ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్ అని మరోసారి రుజువైంది.
రీ రిలీజ్ రికార్డుల్లో 'బాహుబలి: ది ఎపిక్' ఏకంగా 52.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఒక పాత సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇన్నేళ్లయినా ఆ విజువల్స్, ఆ డ్రామాను బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏమాత్రం తగ్గలేదని ఈ నంబర్ చెబుతోంది. ఇది చాలామంది టైర్ 2 హీరోల కొత్త సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్ కంటే ఎక్కువ కావడం విశేషం.
మిగతా సినిమాలు అవి రిలీజ్ అయిన థియేటర్ కౌంట్ ప్రకారం ఆ రేంజ్ కు తగ్గట్టు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక రెండో స్థానంలో రీసెంట్ బ్లాక్ బస్టర్ 'సలార్' నిలిచింది. ఈ సినిమా రీ రిలీజ్ లో 4.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. సినిమా వచ్చి ఎంతో కాలం కాకపోయినా, అందులోని డార్క్ యాక్షన్, ప్రభాస్ కటౌట్ కు ఉన్న క్రేజ్ వల్ల జనం మళ్ళీ థియేటర్లకు క్యూ కట్టారు. ఇది ప్రభాస్ మాస్ ఇమేజ్ కు నిదర్శనం. ఇక మూడో స్థానంలో 'వర్షం' 3.5 కోట్లతో నిలిచింది. వింటేజ్ ప్రభాస్ ను, ఆ మ్యూజిక్ మ్యాజిక్ ను ఆస్వాదించడానికి ఫ్యాన్స్ దీనికి బ్రహ్మరథం పట్టారు.
మరోవైపు స్టైలిష్ డాన్ గా ప్రభాస్ ను చూపించిన 'బిల్లా' కూడా రీ రిలీజ్ రేసులో వెనక్కి తగ్గలేదు. అది 1.1 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. కథ పాతదే అయినా, మేకింగ్ లో ఉన్న స్టైల్ వల్ల ఈ సినిమా ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఇలా లవ్, యాక్షన్, స్టైల్, ఎపిక్ డ్రామా.. ఏ జానర్ అయినా ప్రభాస్ ఉంటే చాలు జనం చూస్తారని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఇంకే పాత సినిమాలు వచ్చి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి.
