Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్-ర‌ణ‌వీర్-ర‌ణబీర్ ఈ ముగ్గురికీ ఒక‌టే స‌మ‌స్య‌!

ప్రభాస్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ భారీ విజయాలతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించినా.. చిన్న బడ్జెట్, ప్రేమకథలు, ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కష్టంగా మారిందనే విశ్లేషణ సాగుతోంది. పెరిగిన ఇమేజ్, మార్కెట్ అంచనాల మధ్య తమలోని నటుడికి నచ్చే కథలను ఎంచుకోవడం ఈ ముగ్గురికీ సవాల్‌గా మారింది.

By:  Sivaji Kontham   |   26 Nov 2026 9:24 AM IST
ప్ర‌భాస్-ర‌ణ‌వీర్-ర‌ణబీర్ ఈ ముగ్గురికీ ఒక‌టే స‌మ‌స్య‌!
X

భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్‌డమ్ ఒక వరంలా కనిపిస్తున్నా.. అది కొందరు అగ్ర హీరోలను ఇమేజ్ అనే ఇరుకైన చ‌ట్రంలో ఇరికించింద‌నే విశ్లేష‌ణ సాగుతోంది. ముఖ్యంగా ప్రభాస్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ వంటి ముగ్గురు అగ్ర హీరోల‌కు ఇప్పుడు ఒకే రకమైన సవాల్ ఎదురవుతోంది. బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ హీరోలు.. తమ స్థాయి పెరిగిన కొద్దీ గతంలో చేసినట్లుగా చిన్న బడ్జెట్ సినిమాలు.. సున్నితమైన ప్రేమకథలు - వైవిధ్యం ఉన్న క‌థ‌ల‌తో ప్రయోగాలు చేయలేని పరిస్థితిలో చిక్కుకుపోయారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ముందుగా ప్రభాస్ విషయానికొస్తే.. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత అత‌డి ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఆకాశాన్ని తాకింది. ఆ తర్వాత చేసిన కొన్ని మోస్తరు బడ్జెట్... సాఫ్ట్ ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ప్రభాస్‌ను కేవలం లార్జర్ దేన్ లైఫ్ పాత్రలలో.. భారీ యాక్షన్ అవతారంలో మాత్రమే చూడాలని అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దీంతో అత‌డు ఒక్కసారిగా మెట్లు దిగి ఒకప్పటిలా పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్లు .. కాన్వాస్ ప‌రంగా చిన్న స్థాయి కథలను ఎంచుకుంటే ఆడియన్స్ అంగీకరించని పరిస్థితి నెలకొంది.

ఇదే తరహా పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌కు కూడా ఎదురైంది. దురంధర్, దురంధర్ 2 చిత్రాలతో ఏకంగా రూ. 3000 కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌వీర్ ఇప్పుడు తిరుగులేని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ భారీ విజయాల తర్వాత అత‌డు గతంలో చేసిన రొమాంటిక్ జానర్ సినిమాలు చేయాలంటే మార్కెట్ పరంగా కొంత ఇబ్బందికర స్థితి ఏర్పడింది. అందుకే నెక్ట్స్ చేయ‌బోయే సినిమాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ.. గ్లోబల్ రీచ్ ఉండేలా `ప్రళయ్` అనే పూర్తిస్థాయి ప్రయోగాత్మక జాంబీ డ్రామాను ఎంచుకున్నారు.

మరోవైపు `రామాయణ`తో 1500 కోట్ల క్లబ్‌లో చేరిన రణ్‌బీర్ కపూర్ ముందు కూడా ఇదే త‌ర‌హా మార్కెట్ లెక్క‌లు స‌మ‌స్య‌గా మారుతున్నాయ‌నేది ఒక విశ్లేష‌ణ‌. రామాయణ 2, లవ్ & వార్, యానిమల్ పార్క్ అన్నీ వందల కోట్ల బడ్జెట్ చిత్రాలే కావడంతో.. అత‌డు మళ్లీ రాక్‌స్టార్, బర్ఫీ లాంటి చిన్న సినిమాలు ప్ర‌యోగాత్మ‌కంగా చేయడం వాణిజ్యపరంగా సాధ్యం కాదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్ తరణ్ ఆదర్శ్ వంటి వారు విశ్లేషిస్తున్నారు. హీరో ఇమేజ్, పారితోషికం పెరిగినప్పుడు కేవలం భారీ కాన్వాసుపైనే కనిపించాల్సిన ఒత్తిడి పెరుగుతుందని.. ఇది రణ్‌బీర్ లోని విలక్షణ నటుడికి ఒక రకమైన అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు.

దేశంలోని ముగ్గురు బడా పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్, రణ్‌వీర్, రణ్‌బీర్ తమ సూపర్ స్టార్ ఇమేజ్ అనే వెయిట్‌ని మోస్తూనే.. కథల ఎంపికలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల ఉచ్చులో చిక్కుకుపోకుండా... తమలోని అసలైన నటులను సంతృప్తిపరిచేలా .. అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ ముగ్గురు స్టార్లు మునుముందు ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు సాగుతారో వేచి చూడాలి. ప్ర‌స్తుతం ఆ ముగ్గురి స‌మ‌స్య గురించి ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.