వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్.. టాప్ లిస్ట్ ఇదే..
బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్కును టచ్ చేయడం అంటే ఒకప్పుడు అది పెద్ద గగనం.
By: M Prashanth | 10 Jan 2026 3:12 PM ISTబాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్కును టచ్ చేయడం అంటే ఒకప్పుడు అది పెద్ద గగనం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా పెరిగాక, మొదటి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' కూడా ఈ ఎలైట్ క్లబ్బులో చేరిపోయింది. సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తున్నా, వసూళ్ల విషయంలో మాత్రం ప్రభాస్ తన సత్తా చాటుతున్నాడు. మేకర్స్ అధికారికంగా వంద కోట్ల పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ లెక్కలపై పెద్ద చర్చ నడుస్తోంది.
నిజానికి రాజా సాబ్ కి వచ్చిన టాక్ చూస్తే ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయని చాలా మంది ఊహించలేదు. సెకండ్ హాఫ్ లో సాగదీత ఉన్నా, డార్లింగ్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు సంక్రాంతి సెలవులు కలిసి రావడం ఈ వసూళ్లకు ప్రధాన కారణం. గతంలో బాహుబలి 2, సాహో వంటి సినిమాలతో ప్రభాస్ ఈ ఫీట్ ను చాలాసార్లు అందుకున్నాడు. ఇప్పుడు రాజా సాబ్ తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నాడు.
తెలుగు సినిమాలే కాకుండా కోలీవుడ్ నుంచి విజయ్ నటించిన లియో, గోట్ వంటి చిత్రాలు కూడా ఫస్ట్ డే వంద కోట్ల మార్కును దాటాయి. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు రాజా సాబ్ కూడా ఆ సినిమాల సరసన చేరినట్లు మేకర్స్ చెబుతున్నారు. మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ వంద కోట్ల లెక్కలు చూస్తుంటే, టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతోంది.
పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడీ వంటి రీసెంట్ సెన్సేషన్స్ కూడా మొదటి రోజు సెంచరీ కొట్టేశాయి. రాజా సాబ్ విషయంలో హారర్ కామెడీ జోనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వసూళ్లు లాంగ్ రన్ లో ఎంతవరకు నిలకడగా ఉంటాయనేదే ఇప్పుడు అసలైన పాయింట్. కేవలం ప్రభాస్ క్రేజ్ తోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా.
మొదటి రోజు రికార్డులు బాగున్నా, రాబోయే రోజుల్లో ఇతర పెద్ద సినిమాలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. రాజా సాబ్ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు రసవత్తరంగా మారింది. మిక్స్డ్ టాక్ ను దాటుకుని ఈ సినిమా తన జోరును ఎలా కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పటివరకు మొదటి రోజే వంద కోట్ల వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాను ఒకసారి గమనిస్తే..
ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ సినిమాలు
బాహుబలి 2
సాహో
ఆర్ఆర్ఆర్
కేజీఎఫ్ 2
పఠాన్
ఆదిపురుష్
జవాన్
లియో
యానిమల్
సలార్
కల్కి 2898 ఏడీ
గోట్
దేవర
పుష్ప 2
ఓజీ
కూలీ
ది రాజా సాబ్
