అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా సందీప్ రెడ్డి వంగా
తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో మేకర్స్ సినిమాల మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Aug 2025 1:03 PM ISTతెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో మేకర్స్ సినిమాల మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆచితూచి అడుగులేస్తూ ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో షూటింగ్ లో జాప్యం, సినిమా ఆలస్యంగా రిలీజవడం జరుగుతున్నాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎక్కువ టైమ్ తీసుకోవాల్సి వస్తుంది.
రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీ
అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలను లైన్ లో పెట్టి ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో డార్లింగ్ హీరో బిజీ అయిపోయారు. ఆ రెండింటిలో మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజా సాబ్ ఆఖరి దశకు చేరుకోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీని కూడా వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ప్రభాస్ చూస్తున్నారు.
ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక ప్రభాస్, తన తర్వాతి సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ ను చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చినప్పటికీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. యానిమల్ తర్వాత నుంచి సందీప్ ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.
స్పిరిట్ కోసం సందీప్ ప్లాన్
ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ, స్పిరిట్ సినిమాను సందీప్ కేవలం ఒక సంవత్సరం లోపే షూటింగును, పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసి, వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం స్పిరిట్ విషయంలో సందీప్ రికార్డు సృష్టించడం ఖాయం. ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
