Begin typing your search above and press return to search.

రాధాకృష్ణ, మారుతి ఎఫెక్ట్.. సందీప్, హను సంగతేంటి?

బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ పేరు ఇండియా వైడ్ గా మార్మోగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో స్థాయిని దాటి పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగారు.

By:  M Prashanth   |   12 Jan 2026 8:00 AM IST
రాధాకృష్ణ, మారుతి ఎఫెక్ట్.. సందీప్, హను సంగతేంటి?
X

బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ పేరు ఇండియా వైడ్ గా మార్మోగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో స్థాయిని దాటి పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగారు. అలాంటి స్థాయిలో ఉన్న నటుడితో సినిమా చేసే అవకాశం దక్కడం ఏ దర్శకుడికైనా గొప్ప అవకాశం. అయితే ఆ ఛాన్స్ ను అందుకున్న కొందరు తెలుగు దర్శకులు దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోలేదన్న విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌ తో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న దర్శకుల్లో రాధాకృష్ణ, మారుతి పేర్లు ముందు వినిపిస్తాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధే శ్యామ్, మారుతి తెరకెక్కించిన ది రాజా సాబ్.. ఆ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైనా, అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ మిగిల్చాయి. దీంతో ఇప్పుడు ఓ ప్రశ్న తెరపైకి వచ్చింది.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్‌ కు తగ్గ కథలను తెలుగు దర్శకులు ఇవ్వలేకపోయారా? అన్న సందేహం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. భారీ బడ్జెట్‌ ఉన్నా విజన్ లోపిస్తే ఫలితం ఎలా ఉంటుందో రెండు సినిమాలు చూపించాయని అంతా అంటున్నారు. ప్రభాస్ స్టార్ ఇమేజ్‌ మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్లడం సరిపోదని, ఆయన స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన కథలు అవసరమని రిజల్ట్ లు స్పష్టం చేశాయి.

అయితే ఆ విమర్శల్లో నాగ్ అశ్విన్‌ ను కలపకూడదని అభిప్రాయపడుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ ప్రభాస్ కెరీర్‌ లో భిన్నమైన ప్రయత్నంగా నిలిచింది. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా, విజన్, కథ, నిర్మాణం పరంగా సినిమా ప్రభాస్ స్థాయికి న్యాయం చేసిందనే టాక్ వినిపిస్తోంది. కేవలం స్టార్ పవర్‌ పై ఆధారపడకుండా, స్ట్రాంగ్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ తీశారని చెప్పాలి.

ఇప్పుడు డార్లింగ్ తదుపరి సినిమాలపై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా దర్శకులు సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి తీస్తున్న చిత్రాలపై భారీ చర్చ జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పిరిట్ తో వంగా ప్రభాస్‌ను పూర్తిగా కొత్త యాంగిల్ లో చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఫౌజీలో ఎమోషన్స్ తోపాటు హీరోయిజం తో కథ ఉంటుందని టాక్.

అదే సమయంలో ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది.. అదేంటంటే ప్రభాస్ వంటి స్టార్‌ తో సినిమా తీయాలంటే కేవలం క్రేజ్, బడ్జెట్ సరిపోదు. దర్శకుల్లో ధైర్యం ఉండాలి. కథపై పూర్తి నమ్మకం ఉండాలి. స్పష్టమైన విజన్‌ తో హీరోను చూపించే ప్రయత్నం చేయాలి. లేకపోతే నిరాశ తప్పదని గత అనుభవాలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు సందీప్, హను ప్రభాస్ రేంజ్‌ కు తగ్గ కథలతో ముందుకొస్తారా? లేక గతాన్ని మళ్లీ రిపీట్ చేస్తారా? అన్నది వేచి చూడాలి.