Begin typing your search above and press return to search.

తేడా కొట్టాల్సిన సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రభాస్!

టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్‌తో పాటు మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో 'డార్లింగ్' ఒకటి.

By:  Srikanth Kontham   |   21 Aug 2026 3:00 PM IST
తేడా కొట్టాల్సిన సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రభాస్!
X

టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్‌తో పాటు మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో 'డార్లింగ్' ఒకటి. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ అప్ప‌ట్లో యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ నటన, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తాయి. అయితే ఈ సినిమా విజయం వెనుక ఓ ఆసక్తికరమైన సీక్రెట్ ఉందని.. ప్రభాస్ చెప్పిన ఒకే ఒక్క చిన్న ఐడియా సినిమా ఫలితాన్ని పూర్తిగా మార్చేసిందని తాజాగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

రీసెంట్ ఇంటర్వ్యూలో `డార్లింగ్` షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను శ్రీనివాస్ రెడ్డి పంచుకున్నారు. సినిమాలోని కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ సమయంలో స్క్రిప్ట్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం విలన్లను మభ్యపెట్టడం కోసం ప్రభాస్ ఒక అబద్ధపు ఫ్లాష్‌బ్యాక్ చెప్పే లా సీన్ డిజైన్ చేయబడింది. అయితే హీరో చెప్పేది అబద్ధం అని ఆడియన్స్‌కి కూడా తెలిస్తే ఆ సన్నివేశంతో ప్రేక్షకులు డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని శ్రీనివాస్ రెడ్డి భావించారు.

ఈ విషయాన్ని ఆయన వెంటనే డైరెక్టర్ కరుణాకరన్‌కు వివరించగా ఆయన కూడా దానిని గ్రహించారు. అదే సమయంలో అక్కడ ఉన్న ప్రభాస్ కూడా ఆ పాయింట్‌తో పూర్తిగా ఏకీభవించారు. విలన్లను మోసం చేయడానికి చెప్పే కథలా కాకుండా దాని వెనుక అసలు నిజమైన భావోద్వేగం ఉండేలా మార్పులు చేయాలని చర్చించారు. ఆ చర్చల ఫలితంగానే ఆ ఇంటర్వెల్ సీన్‌లో అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది.

అక్కడే ఆ సీన్‌లో `ఏదో కథ చెప్పడం కాదురా? ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమను కథగా మార్చి చెప్పాను` అనే శక్తివంతమైన డైలాగ్‌ను యాడ్ చేయాలనే ఆలోచన ఓకే అయింది. ఈ ఒక్క చిన్న డైలాగ్ .. ఎమోషనల్ చేర్పు వల్ల ఆ సీన్‌కు హై రేంజ్ ఎలివేషన్ వచ్చింది. అబద్ధం చెప్పే సీన్ కాస్తా హీరోయిన్‌పై హీరోకు ఉన్న నిజమైన ప్రేమను చాటిచెప్పే ఎమోషనల్ మూమెంట్‌గా మారిపోయింది.

ఒకవేళ ఆ సమయంలో ఆ చిన్న మార్పు గనుక చేయకపోయి ఉంటే? ఆ ఇంటర్వెల్ బ్లాక్ తేడా కొట్టి సినిమా ఫలితం వేరేలా ఉండేదని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రభాస్ తో తనకున్న అనుభవంతో ఇచ్చిన ఆ ఒక్క ఐడియా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. అలాగే దర్శకుడు కరుణాకరన్ వర్క్ డెడికేషన్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. క‌రుణాక‌ర‌న్ పనిచేసే విధానం నచ్చి తాను వేరే సినిమాల డేట్స్ కూడా పక్కనపెట్టి మరీ `డార్లింగ్` సినిమాను పూర్తి చేశానని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

తెర వెనుక దర్శకులతో కలిసి పని చేస్తూ కథను మెరుగుపరచడంలో ప్రభాస్ లాంటి స్టార్స్ ఎంత శ్రద్ధ పెడతారనేదానికి `డార్లింగ్` సినిమానే నిదర్శనం. ఈ చిన్న ఇన్పుట్ వల్ల సినిమా స్థాయి మరింత పెరిగిందని ట్రేడ్ వర్గాలు కూడా అంటుంటాయి. ఎప్పటికీ ఎంతో ఇష్టంగా చూసే క్లాసిక్ లవ్ స్టోరీ వెనుక ఉన్న ఈ సీక్రెట్ అభిమా నులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.