Begin typing your search above and press return to search.

డియ‌ర్ ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్.. ఇది విన్నారా?

టాలీవుడ్ లో స్క్రిప్ట్ బ్యాంక్ ల‌ను రూపొందించేందుకు ప‌లు నిర్మాణ సంస్థ‌లు ప్ర‌తిభావంతుల‌ను ఎప్పుడూ ప్రోత్స‌హిస్తూనే ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   21 Dec 2025 11:45 PM IST
డియ‌ర్ ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్.. ఇది విన్నారా?
X

టాలీవుడ్ లో స్క్రిప్ట్ బ్యాంక్ ల‌ను రూపొందించేందుకు ప‌లు నిర్మాణ సంస్థ‌లు ప్ర‌తిభావంతుల‌ను ఎప్పుడూ ప్రోత్స‌హిస్తూనే ఉన్నాయి. చాలా మంది యువ ప్ర‌తిభావంతులు స్క్రిప్టు రాసుకుని, ల‌ఘు చిత్రాల‌ను రూపొందించ‌డం ద్వారా ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమలో పెద్ద హీరోల‌తో సైతం అవ‌కాశాల్ని అందుకుంటున్నారు. నిజానికి సాంకేతిక‌త విస్త్ర‌తంగా అందుబాటులోకి వ‌చ్చిన ఈరోజుల్లో అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌తో చాలా ప్ర‌యోగాలు చేయ‌గ‌లం. స్మార్ట్ డిజిట‌ల్ యుగంలో కొన్ని నిమిషాల నిడివి ఉన్న ల‌ఘు చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. జీల్ ఉండాలే కానీ, ప్ర‌తిభ‌, ఆస‌క్తి, క‌ష్ట‌ప‌డేత‌త్వం ఉండాలే కానీ, క్రియేటివిటీతో కొట్టాలే కానీ, నిజానికి ల‌ఘు చిత్రాన్ని ఖ‌ర్చు అన్న‌దే లేకుండా తెర‌కెక్కించి దానికి స్వ‌యంగా ఎడిటింగ్ చేసుకుని, సౌండ్ ట్రాక్ ల‌ను జోడించి చివ‌రికి మొత్తం ఉత్ప‌త్తిని ఇండివిడ్యువ‌ల్ గా రూపొందించ‌వ‌చ్చు. అయితే మారిన సాంకేతిక‌తను అర్థం చేసుకుని దానిలో అంతో ఇంతో శిక్ష‌ణ పొందితే చాలు.

నిజానికి క్రియేటివ్ రంగంలో జాక్ పాట్ కొడితే అందుకునే ప్ర‌తిఫ‌లం చాలా పెద్ద‌గా ఉంటుంది. దానికోసం జీల్‌తో శ్ర‌మించ‌డం చాలా అవ‌స‌రం. అయితే పై అన్నివిధాలా అర్హ‌త‌లు ఉన్న ప్ర‌తిభావంతుల కోసం పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ `ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌`ను ప్రారంభించారు. ఇది ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే సాహసోపేతమైన ముంద‌డుగు. జెన్ జెడ్ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు ఇది వ‌రంలా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జీల్ ఉన్న ల‌ఘు చిత్ర ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు త‌మ స్క్రిప్టుల‌ను అందించాల్సిందిగా ఈ ఫెస్టివ‌ల్ ని ప్రారంభించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, హ‌ను రాఘ‌వ‌పూడి ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కి స్ఫూర్తి నింపే ఎన్నో విష‌యాల‌ను చెప్పారు. ఎవ‌రైనా ద‌ర్శ‌క‌ర‌చ‌యిత క‌చ్ఛితంగా ల‌ఘు చిత్రంతో త‌మ ఉనినికి చాటుకోగ‌ల‌ర‌ని వారు సూచించారు. ల‌ఘు చిత్రాల ద్వారా ఎదిగిన ఫిలింమేక‌ర్స్ గురించి వారు చెప్ప‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇది రొటీన్ పోటీలా కాదు.. ప్రేక్షకుల‌లో విస్త్ర‌తంగా షేర్ అయి., 90 రోజులకు పైగా ఆద‌రించిన‌ రెండు నిమిషాలు, అంతకంటే ఎక్కువ నిడివి గల లఘు చిత్రాలను

ఈ ఫెస్టివ‌ల్ కోసం పంపుకోవ‌చ్చు. ఓట్లు, లైక్‌లు , రేటింగ్‌ల ద్వారా మొదటి మూడు విజేతలను నిర్ణయిస్తారు.

ఇలాంటి ఉత్స‌వాల‌లో పాల్గొన‌డం ద్వారా ప్ర‌తి క్రియేట‌ర్ త‌మ ఉనికిని చాటుకోగ‌ల‌డు. త‌మ‌లోని ప్ర‌తిభ‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించ‌గ‌ల‌డు. ఇక ఈ ఫెస్టివ‌ల్ ప్ర‌చారం కోసం క్విక్ టీవీ స‌హ‌క‌రిస్తోంది. సెలెక్ట్ అయ‌న ప్ర‌తిభావంతుల‌లో 90ని.ల నిడివికి స‌రిపోయే స్క్రిప్టును రెడీ చేసేందుకు నిర్మాణ సంస్థ‌ల నుంచి పూర్తి స‌హాయ‌స‌హ‌కారాలు, మ‌ద్ధ‌తును పొందుతారు. ఇది అతిపెద్ద అవ‌కాశాల‌కు దారి తీయ‌వ‌చ్చు. సినిమా నిర్మాణం స‌హా క్విక్ టీవీలో అంతర్జాతీయ ప్రీమియర్ అవ‌కాశం... ల‌భిస్తుంది. తాళ్ల వైష్ణవ్- ప్రమోద్ ఉప్పలపాటి స్థాపించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌తిభావంతులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు.

మొద‌టిసారి ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మైనా కానీ, ఇలాంటి వాటి కోసం మునుముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కి కూడా అర్థ‌మ‌వుతుంది.