కల్కి 2.. ఇది పరిస్థితి
ముందు క్లారిటీతో చెప్పిన దర్శకుడు ఇప్పుడు డేట్ చెప్పకపోవడంతో మధ్యలో ప్లాన్ మారిపోయిందనే విషయం అర్థమవుతోంది.
By: M Prashanth | 1 Sept 2026 2:06 PM IST‘కల్కి 2’ షూటింగ్ గురించి నాగ్ అశ్విన్ కొన్ని నెలల క్రితం చెప్పింది ఒకటైతే ఇప్పుడు చెప్పింది మరొకటి. జూన్‌లో మాట్లాడినప్పుడు ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పని కూడా చాలా వరకు పూర్తైందన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పది రోజుల షూటింగ్ జరిగిందని, మళ్లీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తారో తనకే తెలియదని చెప్పారు.
ముందు క్లారిటీతో చెప్పిన దర్శకుడు ఇప్పుడు డేట్ చెప్పకపోవడంతో మధ్యలో ప్లాన్ మారిపోయిందనే విషయం అర్థమవుతోంది. దీనికి ప్రభాస్ షెడ్యూల్ కూడా ఒక కారణమే అనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’పై ఆయన ఎక్కువ రోజులు పని చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కూడా ముందుకు వెళ్తోంది.
ఈ రెండు సినిమాలకు ఇప్పటికే రిలీజ్ ప్లాన్లు ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ నుంచి ‘కల్కి 2’ కోసం వరుసగా పెద్ద షెడ్యూల్ తీసుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని వారాలు ఒకేసారి ఖాళీగా దొరికితేనే పెద్ద భాగం పూర్తి చేయగలరు. నాగ్ అశ్విన్ వైపు నుంచి ప్లాన్ ముందుగానే సిద్ధమైంది. మొదటి భాగం కోసం వేసిన సెట్స్, తయారు చేసిన వాహనాలు, పాత్రల లుక్స్, ఆ ప్రపంచానికి సంబంధించిన డిజైన్స్ అన్నీ ఇప్పటికే ఉన్నాయి.
రెండో భాగానికి పూర్తిగా కొత్త ప్రపంచం నిర్మించాల్సిన అవసరం లేదు. అందుకే షూటింగ్ మొదలైతే స్పీడ్ గా చేయగలమని నాగ్ అశ్విన్ గతంలో చెప్పారు. కానీ షూటింగ్‌కు కావాల్సిన డేట్స్ ఒకేసారి దొరకకపోతే ముందుగా అనుకున్న నెలల్లో పని మొదలవ్వదు. ఇంకో పని క్యాస్టింగ్ దగ్గర ఉంది. మొదటి సినిమాలో సుమతి పాత్ర చేసిన దీపికా పదుకొణె రెండో భాగంలో ఉండటం లేదు. కానీ సుమతి పాత్ర కథలో కొనసాగుతుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పారు. అంటే ఆ పాత్రకు మరో హీరోయిన్‌ను తీసుకోవాలి.
మరోవైపు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలు కూడా రెండో భాగంలో ముఖ్యంగా ఉండనున్నాయి. ప్రభాస్‌తో పాటు వీళ్ల డేట్స్ కూడా కుదరాలి. పెద్ద కాంబినేషన్ సీన్లు ఉంటే అందరినీ ఒకే షెడ్యూల్‌లోకి తీసుకురావడం ఇంకా కష్టం. పది రోజుల షూటింగ్ జరిగిందన్న మాట మాత్రం కొత్త విషయం. ఇప్పటివరకు సీక్వెల్ ఇంకా మొదలుకాలేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ కొంత భాగం ఇప్పటికే తీశారని నాగ్ అశ్విన్ చెప్పేశారు.
ఆ పది రోజుల్లో ఎవరి సీన్లు తీశారు, ప్రభాస్ ఎంతవరకు పాల్గొన్నారు అనే వివరాలు బయటకు రాలేదు. మొదటి భాగం చివర్లో భైరవ, అశ్వత్థామ, యాస్కిన్ కథలను వేర్వేరు చోట్ల ఆపారు. రెండో భాగంలో ఆ కథ ముందుకు వెళ్లాల్సి ఉంది. ‘ఫౌజీ’ డిసెంబర్ రిలీజ్ కోసం పరుగులో ఉండగా, ‘స్పిరిట్’ను వచ్చే ఏడాది మార్చికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య ప్రభాస్ ఎన్ని రోజులు ‘కల్కి 2’కు ఇస్తారన్నదే చూడాలి.
