Begin typing your search above and press return to search.

ఏ అప్డేట్ లేకుండానే ఇంత క్రేజా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన క‌ల్కి 2898AD భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 May 2026 10:38 AM IST
ఏ అప్డేట్ లేకుండానే ఇంత క్రేజా?
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన క‌ల్కి 2898AD భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి దాని సీక్వెల్ కల్కి2 పైనే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాపై మేకర్స్ నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోయినా సినిమాపై హైప్ ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణంగా సీక్వెల్స్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. కానీ కల్కి2 విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ మొదటి భాగంలో సృష్టించిన వరల్డ్ బిల్డింగ్, ఎమోషనల్ కనెక్ట్, అలాగే క‌ల్కి క్లైమాక్స్ లో వ‌దిలేసిన భారీ క్యూరియాసిటీ.

మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న స్టార్ పవర్ కూడా హైప్ ను మ‌రింత పెంచుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ నటుల పాత్రలు సీక్వెల్‌లో మరింత విస్తరించనున్నాయనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూడకుండా అమితాబ్, కమల్ హాసన్‌లకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూర్తి చేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. అంటే డైరెక్ట‌ర్ షూటింగ్‌ను దశలవారీగా ప్లాన్ చేస్తూ, హీరో అందుబాటులోకి వచ్చేలోపు ఇతర భాగాలను పూర్తి చేసే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారని అర్థ‌మ‌వుతోంది.

అయితే కల్కి2 ఆలస్యానికి ప్రధాన కారణంగా ప్రభాస్ కమిట్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన లైన‌ప్ లో స్పిరిట్, ఫౌజీ లాంటి భారీ ప్రాజెక్ట్స్ ఉండ‌టంతో చాలా బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు. దీంతో కల్కి 2 షూటింగ్ పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై క్లారిటీ రావ‌డం లేదు. ఇదే సమయంలో 2027 డిసెంబర్‌లో సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన మేకర్స్‌లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ టార్గెట్ సాధ్యమవుతుందా అన్న సందేహాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

దానికి కారణం ఈ సినిమా అన్ని సినిమాల్లాగా సాధార‌ణ కమర్షియల్ మూవీ కాకపోవడమే. కల్కి2కి భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్, సీజీఐ, వర్చువల్ వరల్డ్ డిజైనింగ్ అవసరం ఉంటుంది. మొదటి భాగానికే పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా టైమ్ పట్టింది. ఇప్పుడు సీక్వెల్‌లో యాక్షన్ స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ మరింత పెరగనున్నాయని సమాచారం. అంటే షూటింగ్ పూర్తయ్యాక కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు పూర్తి స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ అవసరమ‌వుతుంది. అందుకే నాగ్ అశ్విన్ ఎలాంటి తొందరపడకుండా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నార‌ని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక అభిమానుల పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. ఒకవైపు సినిమా డిలే అవుతుందేమోనన్న టెన్షన్ ఉన్నా, మరోవైపు బాహుబలి2 తరహాలో భారీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎంతకాలమైనా వేచి ఉండేందుకు సిద్ధంగా ఉన్నామనే భావన సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి పోస్టర్, టీజర్, అప్డేట్ లేకపోయినా కల్కి2 తరచూ ట్రెండింగ్‌లో ఉండటం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. అంతేకాదు, కెజిఎఫ్2, పుష్ప తర్వాత భారతీయ సినిమాల్లో ఫ్రాంచైజ్ కల్చర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా కూడా కల్కి2ను చూస్తున్నారు. ఫ్యూచ‌ర్ లో ఈ యూనివర్స్ నుంచి స్పిన్ ఆఫ్స్ వచ్చే అవకాశాలపై కూడా చర్చ నడుస్తోంది. మొత్తానికి కల్కి2 విషయంలో అవుతున్న డిలే ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నా, అదే డిలే చివరికి బెస్ట్ అవుట్‌పుట్‌కు దారితీస్తే మాత్రం భారతీయ సినిమా చరిత్రలో మరో గేమ్ ఛేంజర్‌గా ఈ ఫ్రాంచైజ్ నిలిచే అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి.