కల్కి 2 : రెండు పుకార్లలో ఒకటి క్లారిటీ!
ప్రభాస్ హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న 'కల్కి' సినిమాకు సీక్వెల్ రావాల్సి ఉంది.
By: Ramesh Palla | 30 April 2026 2:03 PM ISTప్రభాస్ హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న 'కల్కి' సినిమాకు సీక్వెల్ రావాల్సి ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ పనిలోనే ఉన్నాడని సమాచారం అందుతోంది. అయితే సీక్వెల్‌కి సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్స్ చిత్రీకరణ జరిపారని, మరో రెండు మూడు నెలల షూటింగ్ జరిపితే సినిమా పూర్తి కానున్నట్లు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపించిన కల్కి కి సీక్వెల్‌గా రాబోతున్న కల్కి 2 లో మాత్రం చాలా వెనక్కి తీసుకు వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కల్కి వచ్చి రెండు ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు సీక్వెల్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. కానీ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి ఈ రెండేళ్లలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.
కల్కి 2 లో హీరోయిన్‌గా దీపికా పదుకునే...
కల్కి 2 కి సంబంధించి ప్రధానంగా హీరోయిన్ దీపికా పదుకునే తప్పుకుంది అనే పుకార్లు వినిపిస్తున్నాయి. స్పిరిట్ నుంచి తప్పుకున్న తర్వాత దీపికా ను కల్కి 2 నుంచి కూడా తప్పించారని, ఆమె వర్కింగ్ స్టైల్, ఇతర విషయాలతో దర్శక నిర్మాతలకు ఇబ్బందిగా ఉండటం వల్ల చేసేది లేక, తప్పనిసరి పరిస్థితుల్లో కల్కి 2 నుంచి దీపికా ను తప్పించారనే పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న దీపికా పదుకునే కల్కి లో నటించడం వల్ల మంచి బిజినెస్ జరిగిన మాట వాస్తవం. అయితే సీక్వెల్‌లో ఆమె నటించకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా నుంచి ఆమెను తప్పించారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయమై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మరో పుకారు పై మాత్రం తాజాగా క్లారిటీ వచ్చింది.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో...
ప్రభాస్ అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కల్కి 2' సినిమాలోని ముఖ్య పాత్ర కోసం జేడీ చక్రవర్తిని ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ వార్తలు ప్రముఖ మీడియా సంస్థలు సైతం కవర్ చేశాయి. సోషల్ మీడియాలో ప్రముఖంగా ఈ విషయం గురించి పోస్ట్‌లు రావడం జరిగింది. ఎట్టకేలకు నటుడు జేడీ చక్రవర్తి ఈ విషయం గురించి స్పందించాడు. ఈయన నటించిన గాయపడ్డ సింహం సినిమా విడుదల సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి 2 సినిమాలోని పాత్ర విషయమై స్పందించాడు. కల్కి సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ప్రకటించాడు. అంతే కాకుండా తాను ఇన్ని రోజులు కల్కి లో తాను నటిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ఎంజాయ్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
మహాభారతం నేపథ్యంలో ఈ సినిమా...
కల్కి 2 సినిమాలో కొత్త పాత్రలు చాలానే ఉండబోతున్నాయట. అయితే కొత్త నటీనటులు కాకుండా మొదటి పార్ట్‌లో కనిపించిన వారిలోనే ఎక్కువ శాతం మంది సెకండ్ పార్ట్‌లో కనిపించబోతున్నారట. అందుకే కొత్త నటీనటులు ఎక్కువ శాతం సెకండ్ పార్ట్‌లో కనిపించబోరని సమాచారం అందుతోంది. మహాభారతం తో ముడిపడి కల్కి 2 సినిమాను నడిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెకండ్ పార్ట్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలు కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2027లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు గతంలో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు, కనుక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపు మరెన్ని పుకార్లు ఈ సినిమా గురించి వస్తాయో చూడాలి. ఇటీవల వచ్చిన రెండు పుకార్లలో దీపికా ఔట్ అనే విషయమై క్లారిటీ లేదు, జేడీ చక్రవర్తి నటించాడు అనే విషయం పూర్తిగా అవాస్తవం అని తేలిపోయింది. ఆయన కల్కి 2 కోసం కనీసం ఒక్క రోజు షూటింగ్‌లో పాల్గొనలేదని చెప్పుకొచ్చాడు.
