సినిమాటిక్ ఇన్నోవేషన్‌లో నాకు ఎందుకు ఛాన్సివ్వలేదు.. `సింగ్ గీతం`పై ప్రభాస్ వ్యాఖ్యలు!
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సరికొత్త సృజనాత్మక ప్రయత్నం `సింగ్ గీతం`పై రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రశంసల జల్లు కురిపించారు.
By: Sivaji Kontham | 20 Jun 2026 12:21 AM ISTలెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సరికొత్త సృజనాత్మక ప్రయత్నం `సింగ్ గీతం`పై రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రశంసల జల్లు కురిపించారు. తన బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి ఈ సినిమాను వీక్షించిన ప్రభాస్.. ఈ సృజనాత్మక ప్రయత్నానికి థ్రిల్ అయ్యారు. ఈ చిత్రం ఒరిజినాలిటీని... దీని వెనుక ఉన్న దిగ్ధర్శకుడి మేధస్సును ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్‌తో మాట్లాడిన ప్రభాస్.. ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు తనను ఎందుకు సంప్రదించలేదని సరదాగా ప్రశ్నించారు. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రమని నాగ్ అశ్విన్ చెప్పగా.. తాను కూడా కెరీర్‌లో ప్రయోగాలు చేశానని ప్రభాస్ నవ్వుతూ గుర్తుచేశారు. ఒకవేళ ఇందులో పాటలు పాడాల్సి వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదంటూ ఆయన జోక్ చేశారు.
సినిమాపై ఉన్న అభిమానంతో ప్రభాస్... దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఒక ప్రత్యేకమైన వాయిస్ మెసేజ్ పంపారు. సింగీతాన్ని `ది గ్రేటెస్ట్ ఎవర్` (ఎప్పటికీ అత్యుత్తమ దర్శకుడు) గా అభివర్ణిస్తూ.. ఇంతటి అద్భుతమైన, ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించినందుకు అభినందనలు తెలిపారు. కథా కథనాల్లో సరిహద్దులను దాటి సరికొత్త ఆవిష్కరణలతో ఈ చిత్రాన్ని సింగీతం తెరకెక్కించిన విధానం అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు.
ఇంతటి భిన్నమైన కాన్సెప్ట్ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఈ సినిమా నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రభాస్ అడిగి తెలుసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రతి అడుగులోనూ సింగీతం శ్రీనివాసరావు ప్రధాన శక్తిగా నిలబడి చిత్రీకరించారని నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇదే సంభాషణలో చిత్రనిర్మా నాగ్ అశ్విన్ కాస్త హాస్యాన్ని జోడిస్తూ `కల్కి 2` ప్రస్తావన తీసుకువచ్చారు. వచ్చే నెలలో ప్లాన్ చేసిన రిహార్సల్ సెషన్స్ కోసం ప్రభాస్ అనుమతి కోరారు. ఈ ఇద్దరి మధ్య ఎంతో సరదాగా సాగిన సంభాషణలో.. సింగ్ గీతం చిత్రంపై ప్రభాస్‌కు ఉన్న నిజమైన గౌరవం, అభిమానం స్పష్టంగా కనిపించింది.
సింగీతం రూపొందించిన `సింగ్ గీతం` చిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనంగా మారింది. ఇదొక అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రమనే ప్రశంసలు దక్కాయి. కథాంశం పరంగా చూస్తే..ఇది అత్యంత వినూత్నమైన - విలక్షణమైన కాన్సెప్ట్‌తో సాగుతుంది. కథా కథనాల్లో సరిహద్దులను బద్దలు కొడుతూ... సినిమాటిక్ ఇన్నోవేషన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయనడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే.. ఇందులో మనుషులు బంగారంగా మారిపోయే ఒక విలక్షణమైన విజువల్ థీమ్ - ఫాంటసీ ఎలిమెంట్ ప్రధానాంశంగా సాగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఈ చిత్ర నిర్మాణానికి .. పాత్రల రూపకల్పనకు సంబంధించిన ప్రతి అంశంలోనూ సింగీతం శ్రీనివాసరావు స్వయంగా ఉండి నడిపించారు. ఈ చిత్రంలోని నటీనటుల ప్రదర్శన - వైవిధ్యమైన పాత్రలు కథను మరింత రక్తికట్టించాయని, ఇలాంటి అసాధారణమైన సృజనాత్మక ప్రాజెక్ట్ తెలుగు చలనచిత్ర రంగానికి సరికొత్త గర్వకారణంగా నిలిచిందని పలువురు టాలీవుడ్ ప్రముఖులు కొనియాడారు.
