బాహుబలి 3 వచ్చేస్తోంది.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్!
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి పాత్రలో.. ఆయనకు దీటుగా అంతే స్టామినా ఉన్న దగ్గుబాటి రానా భల్లాల దేవుడి పాత్రలో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు.
By: Madhu Reddy | 26 Jun 2026 11:27 AM ISTబాహుబలి.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ఒక్కసారిగా ఎల్లలు దాటించి అందరి దృష్టిని తెలుగు సినిమాపై పడేలా చేసింది. ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాలకు ఒక హోదాను కల్పించింది అనడంలో సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని రాజమౌళి దగ్గరుండి మరీ చెక్కాడు. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి పాత్రలో.. ఆయనకు దీటుగా అంతే స్టామినా ఉన్న దగ్గుబాటి రానా భల్లాల దేవుడి పాత్రలో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు.
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పేరు శివగామి..
రమ్యకృష్ణ తప్ప ఆ పాత్రకు మరొకరు న్యాయం చేయలేరు అనే రేంజ్ లో ఆమె ఆ పాత్రకు ఊపిరి పోసింది. నాజర్, సత్యరాజ్, అనుష్క, తమన్నా ఇలా ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి, సినిమాను ఒక స్థానంలో కూర్చోబెట్టారు. అలా ప్రతి ఒక్కరి కష్టం ఈ సినిమా ద్వారా కనిపించింది. పైగా ఈ సినిమా క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నతో బాహుబలి సినిమాను ముగించేసి.. ఆ క్యూరియాసిటీని మరింత పెంచుతూ బాహుబలి 2 పై అంచనాలు పెంచేశారు రాజమౌళి. ఈ సినిమా కూడా విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది. అంతేకాదు బాహుబలి తీసుకొచ్చిన క్రేజ్ బాహుబలి 2కి బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచి రికార్డులు సృష్టించింది .
ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా బాహుబలి 3 ఉంటే బాగుండు అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. అయితే బాహుబలి లవర్స్ కోసం ఇప్పటికే బాహుబలి ఎటర్నల్ వార్ అని ఒక యానిమేషన్ సిరీస్ ని ప్రకటించి టీజర్ రిలీజ్ చేశారు. అలాగే బాహుబలి ఎపిక్ అని రెండు పార్ట్స్ ని కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేశారు.
వీటికి తోడు తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా బాహుబలి ది టార్చ్ బేరర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ సీరీస్ ని నాలుగు ఎపిసోడ్స్ గా రిలీజ్ చేశారు. ఇందులో ఈ సినిమా కోసం పనిచేసిన ప్రభాస్ , రాజమౌళి, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సెంథిల్ కుమార్ తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు సినిమా గురించి, వారి అనుభవాలను పంచుకున్నారు. పైగా బాహుబలి మేకింగ్ ని కూడా చూపించారు. దీంతో ఈ సిరీస్ కాస్త వైరల్ గా మారింది.
ఈ సిరీస్ లో రానా, ప్రభాస్, అనుష్క ఒకచోట చేరి మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ముందుగా రానా మాట్లాడుతూ.. చెప్పొచ్చో లేదో తెలియదు. చెప్తే ఏమవుతుందో తెలియదు కానీ ఇక్కడ ఈ షోలో రాజమౌళి లేరు కాబట్టి చెప్పేస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం దీనికి సిద్ధంగా లేదు. కానీ బాహుబలి అని రానా చెప్పడం.. ఆ తర్వాత అనుష్క కూడా బాహుబలి అంటూ దీర్గిస్తుండగా.. ప్రభాస్ తన రెండు చేతులతో మూడు వేళ్లను చూపిస్తూ బాహుబలి 3 ని ప్రకటిస్తుండగానే.. అటు రానా ఇటు అనుష్క ఆయన చేతులను పట్టేసుకున్నారు. ఇక వీరిని బట్టి చూస్తే బాహుబలి 3 త్వరలోనే రాబోతోందనే విషయం స్పష్టం అవుతుంది. అయితే ఎప్పుడు రాబోతోంది? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా బాహుబలి 3 ప్రకటించడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి.
