ప్రభాస్ కోసం హను రూట్ మార్చారా?
టాలీవుడ్ లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న కాంబినేషన్స్ లో ప్రభాస్- హను రాఘవపూడి జోడీ ఒకటి.
By: M Prashanth | 7 Sept 2026 11:07 AM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న కాంబినేషన్స్ లో ప్రభాస్- హను రాఘవపూడి జోడీ ఒకటి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో హను సినిమా చేస్తుండటంతో ఫౌజీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ సినిమాపై చర్చ కేవలం ప్రభాస్ స్టార్ డమ్ వల్లే కాదు.. హను రాఘవపూడి ఎలాంటి సినిమా తీస్తాడనే దానిపైనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే తనదైన సెన్సిబుల్ టేకింగ్ తో సినిమాలు చేసే హను.. ఇప్పుడు భారీ స్టార్ తో తన రేంజ్ ను మరింత పెంచుకుంటున్నారు.
నిజానికి హను రాఘవపూడి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది లవ్ స్టోరీలు, స్ట్రాంగ్ ఎమోషన్స్, రోల్స్ మధ్య కెమిస్ట్రీ. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, సీతారామం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా కథను నెమ్మదిగా చెప్పినా.. చివరికి ఎమోషన్ తో ప్రేక్షకుడిని కట్టిపడేయడం హను స్టైల్ గా మారింది. ఇప్పుడు అదే దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రభాస్ కోసం హను తన రూట్ మార్చాడా? భారీ స్టార్ తో సినిమా అంటే నార్మల్ గానే కథ, స్కేల్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో దర్శకుడిపై ఒత్తిడి ఉంటుంది. ప్రభాస్ సినిమాల నుంచి ఫ్యాన్స్ భారీ స్క్రీన్ ప్రెజెన్స్ ఆశిస్తారు. అదే సమయంలో హను నుంచి మంచి కథ, ఎమోషన్, గుర్తుండిపోయే పాత్రలను కోరుకుంటారు. ఆ రెండు అంచనాలను బ్యాలెన్స్ చేయడమే ఫౌజీకి కీలకం!
అయితే హను పూర్తిగా తన స్టైల్ ను వదిలేసి ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా మాత్రమే సినిమా చేస్తున్నారని చెప్పలేం. అసలు ఆసక్తి కూడా ఇక్కడే ఉంది. ప్రభాస్ స్టార్ డమ్ కు సరిపోయే రేంజ్ లో సినిమాను తీస్తూనే.. తనదైన కథన శైలిని కొనసాగిస్తే ఫౌజీ హను కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఆ సినిమా హను కెరీర్ కు ఎంత ముఖ్యమన్నదీ చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ తో సినిమా అంటే వచ్చే క్రేజ్ వేరు.
ఇప్పటివరకు హను సినిమాలు కంటెంట్, ఎమోషన్ కారణంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. కానీ ఫౌజీ మూవీ సక్సెస్ అయితే.. ఆయన మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేసే అవకాశాలు కూడా పెరగొచ్చు. అందుకే ఫౌజీని కేవలం ప్రభాస్ సినిమా అని చూడటం కంటే.. హను రాఘవపూడి కెరీర్ లో ఒక కీలక ప్రాజెక్టుగా చూడాల్సి ఉంటుంది.
తన సెన్సిటివ్ కథనాన్ని భారీ స్టార్ డమ్ తో ఎంతవరకు కలపగలరన్నదే అసలు పరీక్ష. అది వర్కౌట్ అయితే ఒక్క సినిమాతో హను రేంజ్ మారే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రభాస్ కోసం హను రూట్ మార్చారా? అన్న ప్రశ్నకు సమాధానం సినిమా విడుదలైతేనే పూర్తిగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఉన్న అంచనాలు మాత్రం ఫౌజీ హను కెరీర్ లో మరో సినిమా కాదని.. రేంజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ కావచ్చనే చెప్పాలి.
